ICC Player of the Month : షమీకి నిరాశ.. ప్రపంచకప్ హీరోకే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు..
ICC Player of the Month November : 2023 నవంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ప్రకటించింది.
- Thota Vamshi Kumar
- Published On : December 11, 2023 / 03:35 PM IST
Mohammed Shami-Travis Head
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతి నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే. 2023 నవంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ప్రకటించింది. పురుషుల విభాగంలో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో సెంచరీ చేసి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్‌కు లభించింది. మహిళల విభాగంలో బంగ్లాదేశ్ యువ సంచలన స్పిన్నర్ నహీద అక్తర్ దక్కించుకుంది.
పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం భారత పేసర్ షమీ, ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ లు పోటీ పడగా చివరకు హెడ్‌కే అవార్డు దక్కింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో రెండు వికెట్లు తీయడంతో పాటు 62 పరుగులు, భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుత సెంచరీ (137) చేయడంతో ఎక్కువ ఓట్లు హెడ్‌కు పడ్డాయి. కాగా.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం హెడ్‌కు ఇదే మొదటి సారి. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తరువాత ఈ అవార్డు దక్కించుకున్న రెండో ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు.
యువ స్సిన్ సంచలనం..
మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం బంగ్లాదేశ్‌కు చెందిన నహిదా అక్తర్, ఫర్గానా హక్ లతో పాటు పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ లు పోటీ పడ్డారు. విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన బంగ్లాదేశ్ యువ స్పిన్ సంచలనం నహీద అక్తర్ కు ఈ అవార్డు లభించింది. కాగా.. ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి బంగ్లాదేశీ మహిళా క్రికెటర్‌గా నహిదా అక్తర్ రికార్డులకు ఎక్కింది.
Wasim Jaffer : ఐపీఎల్‌లో ఆ రూల్‌ను తీసేయండి.. లేదంటే భారత క్రికెట్‌కు పెను ముప్పు తప్పదు..!
