T20 World Cup 2026 : భారత్‌తో ఓటమి.. అమెరికా జట్టుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెసేజ్.. నాకు తెలియదు.. కానీ..
టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)పాల్గొన్న అమెరికా జట్టుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలియజేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- February 9, 2026 / 11:29 AM IST
US President Donald Trump wished the country cricket team luck for the T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో యూఎస్ఏ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘భారత్‌లో ప్రపంచకప్ జరుగుతుందనే విషయం గురించి ఇప్పుడే విన్నాను. టీమ్ యూఎస్ఏకి శుభాకాంక్షలు. మాకు బలమైన జట్టు ఉంది. యూఎస్ఏ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను. అమెరికా మొత్తం మీ కోసం ఎదురుచూస్తోంది.’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోన్న టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 పాల్గొంటున్నాయి. భారత్, పాక్, నెదర్లాండ్స్, నమీబియాలతో కలిసి గ్రూప్-ఏలో యూఎస్ఏ ఉంది. ఫిబ్రవరి 7 టోర్నీ ప్రారంభమైంది. ఇక యూఎస్ఏ జట్టు తమ తొలి మ్యాచ్‌ను శనివారం భారత్‌తో ఆడింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు యూఎస్ఏ జట్టు పోరాడింది. కానీ చివరికి 29 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
భారత్‌తో మ్యాచ్ ఓడిపోయిన తరువాత ట్రంప్ మెసేజ్ చేయడం గమనార్హం.
ఇక భారత్, అమెరికా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (84 నాటౌట్; 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20)లు రాణించారు. యూఎస్ఏ బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్విక్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం మిలింద్ కుమార్ (34), సంజయ్ కృష్ణమూర్తి (37), శుభం రంజనే (37) రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
