Vaibhav Sooryavanshi comments after India beat england in U19 World Cup 2026 final
U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరోసారి సగర్వంగా కప్పును ముద్దాడింది.
వైభవ్ సూర్యవంశీ (175; 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు) విధ్వంసకర శతకంత బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. మిగిలిన భారత బ్యాటర్లలో ఆయుష్ మాత్రే (53), అభిజ్ఞాన్ కుంద్(40) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మింటో మూడు వికెట్లు తీశాడు. అలెక్స్ గ్రీన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆ తరువాత 412 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో కాలెబ్ ఫాల్కనర్ (115; 67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. బెన్ డాకిన్స్ (66), బేస్ మేస్ (45)లు రాణించారు.
టీమ్ఇండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో సిరీస్ అవార్డును సైతం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజాయితీగా చెప్పాలంటే తనకు ప్రస్తుతం మాటలు రావడం లేదన్నాడు. గత ఏడు, ఎనిమిది నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితం అని తెలిపాడు. సహాయక సిబ్బంది కూడా ఎంతో శ్రమించారని, అందుకనే తన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
Vaibhav Sooryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అండర్-19 సిక్సర్ల కింగ్..
‘కేవలం ఆసియా కప్‌లోనే కాదు, ఈ టోర్నీ మొత్తం మా సహజ సిద్ధమైన ఆటను ఆడాలని అనుకున్నాం. అదే విధంగా ఆడాము. కొన్నాళ్లుగా మా సన్నద్ధత చాలా బాగుంది. గత ఏడు, ఎనిమిది నెలలుగా మేం ఎంత కష్టపడ్డామో మా ఆటగాళ్లకు మాత్రమే తెలుసు. మమ్మల్ని ఈ రోజు ఈ స్థితికి చేర్చడంలో సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది. ఇక నా నైపుణ్యాలపై నాకు నమ్మకం ఉంది. ఏదైన పెద్ద మ్యాచ్‌ల్లో రాణించగలనని నాకు తెలుసు. ‘ఈ రోజు అది నిజమైంది అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు.