Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డు.. బుడ్డోడా నువ్వు మామూలోడివి కాదురా..
టీమ్ఇండియా నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అరుదైన ఘనత సాధించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 24, 2026 / 08:08 AM IST
Vaibhav Sooryavanshi creates history become Youngest at the time of maiden T20I fifty
Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్నవయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 18 బంతుల్లోనే అర్థశతకం బాదాడు.
2020లో అమెరికాతో జరిగిన వన్డేలో 15 సంవత్సరాల 340 రోజుల వయస్సులో అర్ధశతకం సాధించిన నేపాల్‌కు చెందిన కుశాల్ మల్లా యొక్క మునుపటి రికార్డును బద్దలు వైభవ్ బద్దలు కొట్టాడు. 15 సంవత్సరాల 118 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యవంశీ హాఫ్ సెంచరీ బాదాడు.
భారత్ తరుపున ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండగా.. దాన్ని కూడా వైభవ్ బ్రేక్ చేశాడు. ఫైసలాబాద్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 16 సంవత్సరాల 213 రోజుల వయసులో టెండూల్కర్ హాఫ్ సెంచరీ చేశాడు.
టీ20ల్లో అతి పిన్న వయసులో తొలి హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ (భారత్) – 15 ఏళ్ల 118 రోజులు (2026లో జింబాబ్వేపై )
*లూయిస్ బ్రూస్ (జిబ్రాల్టర్) – 16 సంవత్సరాల 56 రోజులు (మాల్టాపై 2021లో)
* కవిన్ చద్దా (ఇండోనేషియా) – 16 ఏళ్ల 76 రోజులు (స్వీడన్ పై 2026లో)
* అలుసిన్ తురే (సియెర్రా లియోన్) – 16 ఏళ్ల 89 రోజులు (ఘనా పై 2023లో)
* టెన్జిన్ రబ్గే (భూటాన్) – 16 ఏళ్ల 118 రోజులు (చైనాపై 2023లో)
అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయస్సులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ళు వీరే (ఫుల్ మెంబర్ జట్లు)..
* వైభవ్ సూర్యవంశీ (భారత్) – జింబాబ్వే పై 2026లో 15 ఏళ్ల 118 రోజుల వయసులో టీ20 మ్యాచ్‌లో
* సచిన్ టెండూల్కర్ (భారత్) – పాకిస్తాన్ పై 1989లో 16 ఏళ్ల 213 రోజుల వయసులో ఫైసలాబాద్ టెస్టు మ్యాచ్‌లో
*షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – శ్రీలంక పై 1996లో 16 ఏళ్ల 214 రోజుల వయసులో వన్డే మ్యాచ్‌లో
* ముష్తాక్ మహమ్మద్ (పాకిస్తాన్) – భారత్ పై 1960లో 17 ఏళ్ల 39 రోజుల వయసులో కోల్‌కతా టెస్టు మ్యాచ్‌లో
* మహమ్మద్ అష్రఫుల్ – 2001లో శ్రీలంక పై 17 ఏళ్ల 63 రోజుల వయసులో కొలంబో టెస్టు మ్యాచ్‌లో
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మధెవెరె (39; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. భారత బౌలర్లో మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. శివమ్ దూబె, రవిబిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
A 1️⃣9️⃣-ball blitz that goes straight into the history books 📖
A record breaking knock from Vaibhav Sooryavanshi 🔥#TeamIndia | #ZIMvIND pic.twitter.com/mlFK05CW7L
— BCCI (@BCCI) July 23, 2026
అనంతరం వైభవ్ సూర్యవంశీ (50; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీ బాదడంతో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (35; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు.
