Virat Kohli : సెంచరీ అనంతరం విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు.. నా లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసు..
తాను వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని విరాట్ కోహ్లీ (Virat Kohli ) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- September 28, 2026 / 10:03 AM IST
Virat Kohli key comments after century against westindies in 1st ODI
Virat Kohli : తిరువనంతపురం వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగాడు. 296 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 139 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో అత్యంత వేగంగా 15వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇక ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. తన దృష్టి ఎప్పుడూ వ్యక్తిగత మైలురాళ్లపై ఉండదన్నాడు. జట్టు అవసరాలకు అనుగుణంగా పరిస్థితిని అర్థం చేసుకుని తన పని తాను చేయడంపైనే దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు.
‘ఇలాంటి మైలురాళ్ల గురించి నేను ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు. మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని జట్టు కోసం ఏం చేయాలో అది చేయడమే నా పని. తల వంచుకుని శ్రమించడంపైనే ఫోకప్ పెడతాను. ఇప్పటి వరకు నేను సాధించినవన్నీ ఇలాగే వచ్చినవి. ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతాను. తలదించుకుని కష్టపడుతూ ముందుకు సాగాలి.’ అని కోహ్లీ తెలిపాడు.
ఇప్పుడు వస్తున్న కుర్రాళ్లకు ఓ సలహా ఇచ్చాడు. ఫిట్‌గా ఉండేందుకు నిరంతరం శ్రమించాలన్నాడు. ఎంత గుర్తింపు, కీర్తి, అభిమానుల ప్రేమ సాధించినా, మన మూలలను మరిచిపోకూడదని చెప్పుకొచ్చాడు. మనం కెరీర్‌ను ఎలా ప్రారంభించామనేది గుర్తు చేసుకుంటూ ఉంటే జీవితం ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తుందని తెలిపాడు. ఇక తాను ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని అన్నాడు.
నా లక్ష్యం స్పష్టంగా ఉంది
‘వన్డే ప్రపంచకప్ 2027కి ఇంకా ఎక్కువ సమయం లేదు. నా లక్ష్యం ఏంటో నాకు స్పష్టంగా తెలుసు. మెగా టోర్నీ వరకు మనం ఎన్ని మ్యాచ్‌లు ఆడతామనే దానిపై నాకు అవగాహన ఉంది. ముందుగా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తాను. ఆ తరువాత నా బ్యాటింగ్‌కు సవాళ్లను విసురుకుంటాను. ఇక ఈ మ్యాచ్‌లో చివరి 15 ఓవర్లలో వేగంగా ఆడాలని ముందుగానే అనుకున్నాను. ‘అని కోహ్లీ అన్నాడు.
ఇక సిరీస్‌కు ముందు తనకు తానే ఓ ప్రామిస్ చేసుకున్నట్లుగా తెలిపాడు. సానుకూల దృక్ఫథంతోనే ఆడాలని అనుకున్నట్లుగా చెప్పాడు. ఈ మ్యాచ్‌లోనూ అలాగే ఆడానని అన్నాడు. ఎక్కడా అలసత్వం వహించకూడదని అనుకున్నాను. అనుభవం కలిగిన ప్లేయర్‌గా మన సత్తాను సరిగ్గా బయటకు తీసుకురావాలని, నిర్లక్ష్యంగా ఆడి జట్టును కష్టాల్లోకి నెట్టాలని అనుకోలేదని చెప్పాడు.
శుభ్‌మన్ గిల్ పై ప్రశంసలు..
అతను (గిల్ ) జట్టుకు నాయకత్వం వహించడానికి ఒక కారణం ఉంది. వివిధ పరిస్థితుల్లో జట్టును ఎలా గెలిపించాలనే దానిపై అతనికి సరైన అవగాహన ఉంది. అలాంటి ఆటగాడితో భాగస్వామ్యం నెలకొల్పడం కష్టం కాదు. ఏం చేయాలో అతనికి తెలుసు, నాకు తెలుసు. అవసరమైనప్పుడు అనుభవం ఆధారంగా కొన్ని విషయాలపై మాట్లాడుకుంటాం.
IND vs WI : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కామెంట్స్ వైరల్..
అతను ప్రపంచంలోనే అగ్రశ్రేణి వన్డే బ్యాటర్. అతనికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భాగస్వామ్యాలను నిర్మించుకుంటూ, మన జట్టులో ఉన్న ప్రతిభకు తగిన న్యాయం చేయడమే ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో అతను కూడా ఒకడు. ఎంతో ప్రతిభావంతుడు. బ్యాటింగ్ సమయంలో అతనితో ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఫీల్డింగ్‌లో మాత్రం అతనికి నా సహాయం అవసరమైతే ఎప్పుడూ అందుబాటులో ఉంటాను అని కోహ్లీ అన్నాడు.
