IND vs WI : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కామెంట్స్ వైరల్..
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో (IND vs WI) వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
Shai Hope Key comments after West Indies lost first odi against india
IND vs WI : తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. కాగా.. మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్లే తమ జట్టు ఓటమి పాలైందని విండీస్ కెప్టెన్ షై హోప్ తెలిపాడు.
జస్టిన్ గ్రీవ్స్ (101; 108 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. జాన్ క్యాంప్‌బెల్ (62; 60 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), అమీర్ జంగూ (58 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకాలు బాదారు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ రెండు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ సాధించాడు.
అనంతరం విరాట్ కోహ్లీ (139 నాటౌట్; 88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (110; 108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) లు శతకాలతో చెలరేగడంతో 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలో రెండు కోల్పోయి ఛేదించింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ చెరో వికెట్ పడగొట్టారు.
60 నుంచి 80 పరుగులు తక్కువగా చేశాం..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ స్పందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కు ఆ జట్టు ఓపెనర్లు గ్రీవ్స్, జాన్ కాంప్‌బెల్ తొలి వికెట్ కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే.. ఈ అద్భుత ఆరంభాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారని హోప్ తెలిపాడు. దీంతో తాము అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితం అయ్యామని చెప్పుకొచ్చాడు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డే క్రికెట్లో ఏకైక ఆటగాడు..
‘నిజం చెప్పాలంటే.. మేము ఇంకా ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సింది. భారత్‌లోని పిచ్‌లు బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి.. మంచి స్కోరును నమోదు చేయడం చాలా ముఖ్యం. మేము బహుశా 60 నుండి 80 పరుగులు తక్కువ చేశాము. అయితే.. 290 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలింగ్ చేసేటప్పుడు, ప్రతిదీ మనకు అనుకూలంగా జరగాలి. ‘అని హోప్ అన్నాడు.
‘గత కొన్ని సిరీస్‌లుగా మేము ఓపెనర్ల సమస్యను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ మ్యాచ్‌లో వారు మాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రన్‌రేట్‌ను పెంచలేకపోయారు. దీని వల్ల ఇన్నింగ్స్ ఆఖరిలో భారీ స్కోరు సాధించడం కష్టంగా మారింది. ఒకవేళ మేము అనుకున్న స్కోరు సాధించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.’ అని హోప్ చెప్పాడు.
ఏది ఏమైనప్పటికి కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్నాడు. జట్టుగా ఎలా మెరుగుపడాలో అనే విషయం పై చర్చించుకుంటామన్నాడు. ఇక తాను కూడా బ్యాట్‌తో రాణించాల్సి ఉందన్నాడు.
