IND vs WI : మేము ఆ పెద్ద‌తప్పు చేశాం.. అందుకే ఓడిపోయాం.. వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ కీలక కామెంట్స్

IND vs WI : ఊహించని విధంగా మ్యాచ్ ఓడిపోయిన తరువాత వెస్టిండీస్ కెప్టెన్, వికెట్‌కీపర్ షైయ్ హోప్ కీలక కామెంట్స్ చేశాడు.

West Indies Captain Shai Hope

IND vs WI : భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే బుధవారం గువాహటి వేదికగా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని భారత జట్టు 43.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఊహించని విధంగా మ్యాచ్ ఓడిపోయిన తరువాత వెస్టిండీస్ కెప్టెన్, వికెట్‌కీపర్ షైయ్ హోప్ కీలక కామెంట్స్ చేశాడు.

Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. విండీస్‌తో మ్యాచ్‌లో గిల్ సాధించిన కీలక రికార్డులు ఇవే..

హోప్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో మేం ఓడినా.. సానుకూలంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా బ్యాటింగ్ విభాగం అద్భుత ప్రదర్శన ఆనందాన్ని ఇచ్చింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ మేం కఠినమైన లక్ష్యాలను నమోదు చేశాం. ఈ సిరీస్‌లో మేం సాధించిన పురోగతి ఇదే. కానీ, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు ఉన్న భారత జట్టుతో పోటీ పడుతున్నప్పుడు పొరపాట్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వొద్దు. రెండో వన్డేలో ఆ పొరపాట్లు మేము చేశాం. ఫలితంగా భారీ స్కోర్ చేసినా మ్యాచ్ ఓడిపోయాం.

భారత్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లను ఎదుర్కొనేటప్పుడు చిన్న తప్పిదానికి కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని షై హోప్ పేర్కొన్నాడు. ముఖ్యంగా గిల్, రోహిత్‌కు ఆరంభంలోనే మంచి అవకాశం ఇవ్వడం తమకు ప్రతికూలంగా మారిందని చెప్పాడు. 400కు పైగా పరుగులు చేసినప్పటికీ బౌలింగ్‌లో ఇంకాస్త కట్టుదిట్టంగా ఉంటే మ్యాచ్‌ను కాపాడుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు.

ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా భారత జట్టు ఓపెనర్లదే. వాళ్లు నిజంగా చాలా బాగా ఆడారు. మా బౌలింగ్ ఇంకాస్త కట్టుదిట్టంగా ఉండి ఉంటే 400 పరుగులను కాపాడుకునేవాళ్లం. గత మ్యాచ్ కంటే ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ చాలా బాగా ఉంది. ముఖ్యంగా భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం.

యువ లెగ్ స్పిన్నర్ విటెల్ లావ్స్‌ను బౌలింగ్‌కు ఆలస్యంగా తీసుకురావడంపై హోప్ స్పందించాడు. భారత్ వంటి పరిస్థితుల్లో తొలిసారి ఆడుతున్న యువ ఆటగాడిపై వెంటనే ఒత్తిడి పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాడు. అతడు మంచి స్పెల్ వేశాడని, ఇంకా నేర్చుకోవాల్సి ఉందన్న హోప్.. మున్ముందు అతను మరింత బలంగా పుంజుకుంటాడనే నమ్మకం ఉంది అంటూ హోప్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ అద్భుతంగా రాణించారు. జాన్ క్యాంప్‌బెల్ 101, షై హోప్ 104, అమీర్ జాంగూ 114 పరుగులు చేశారు. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో వెస్టిండీస్ వన్డేల్లో తమ అత్యధిక స్కోరు 405/7 నమోదు చేసింది. అయితే భారత జట్టు ఈ భారీ స్కోర్ ను రెండు వికెట్లు కోల్పోయి కేవలం 43.3 ఓవర్లలో నే చేధించింది. భారత జట్టు ఓపెనర్లు రోహిత్ 101 పరుగులు, గిల్ 223 (నాటౌట్) పరుగులు చేయడంతో భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.