World Championship of Legends 2026 : యువ‌రాజ్ సింగ్ డ‌కౌట్‌.. బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఛాంపియ‌న్స్ ఓట‌మి..

వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026లో (World Championship of Legends 2026) విజ‌యంతో బోణీ కొట్టిన ఇండియా ఛాంపియ‌న్స్‌కు ఆ త‌రువాత ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

World Championship of Legends 2026 Bangladesh beat India

World Championship of Legends 2026 : వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026లో విజ‌యంతో బోణీ కొట్టిన ఇండియా ఛాంపియ‌న్స్‌కు ఆ త‌రువాత ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస‌గా మూడో మ్యాచ్‌లోనూ ఓట‌మి పాలైంది. ఆదివారం షార్జా వేదిక‌గా బంగ్లాదేశ్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో యువ‌రాజ్ సింగ్ సార‌థ్యంలోని ఇండియా ఛాంపియ‌న్స్ 3 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 141 ప‌రుగులు చేసింది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో రోనీ తాలుక్దార్ (40; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), అరఫత్ సన్నీ (37; 38 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఇండియా బౌల‌ర్ల‌లో పీయూష్ చావ్లా మూడు వికెట్లు తీశాడు. ప‌వ‌న్ నేగీ, రిషీ ధావ‌న్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మోహిత్ శ‌ర్మ ఓ వికెట్ సాధించాడు.

West Indies : సిక్స‌ర్ల‌లో వెస్టిండీస్ స‌రికొత్త రికార్డు.. ఆ వెనుకే భార‌త్‌..

అనంత‌రం 142 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇండియా ఛాంపియ‌న్స్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 138 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఇండియా బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన ఇర్ఫాన్ పఠాన్ ఘోరంగా ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ సాయంతో కేవ‌లం 24 ప‌రుగులే చేశాడు.

అంబ‌టి రాయుడు (3), యువ‌రాజ్ సింగ్ (0), యూసుఫ్ ప‌ఠాన్ (4)లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. ప‌వ‌న్ నేగీ (26 నాటౌట్; 14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు), పీయూష్ చావ్లా (24 నాటౌట్; 18 బంతుల్లో 2 సిక్స‌ర్లు) రాణించారు. బంగ్లా బౌల‌ర్ల‌లోఎనాముల్ హక్ జూనియర్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అబు జాయెద్ రెండు వికెట్లు తీశాడు. రుబెల్ హొస్సేన్, కమ్రుల్ ఇస్లాం లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.