WPL 2026 : యూపీపై విజయం.. ఎలిమినేటర్‌కు ఢిల్లీ.. టోర్నీ నుంచి ముంబై ఔట్
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో (WPL 2026 )యూపీని ఓడించి ఢిల్లీ ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- February 2, 2026 / 08:50 AM IST
Delhi Capitals defeat UP Warriorz and enter into Eliminator
- డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు
- యూపీని ఓడించి ఎలిమినేటర్‌కు ఢిల్లీ క్యాపిటల్స్
- మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో ఢీ
WPL 2026 : డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు జట్టు ఫైనల్‌కు చేరుకోగా, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మిగిలి ఉన్న మరో స్థానం కోసం ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్ లు పోటీపడ్డాయి. 5 వికెట్ల తేడాతో యూపీని ఓడించి ఢిల్లీ ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో యూపీ విజయం సాధించి ఉంటే.. ముంబై ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉండేది. అయితే.. ఓడిపోవడంతో యూపీతో పాటు ముంబై ఇండియన్స్ జట్లు ఈ సీజన్‌లో (WPL 2026) ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించాయి.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో దీప్తి శర్మ (24), సిమ్రాన్ షేక్ (22), శిఖా పాండే (23) లు పర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో మరిజేన్ కాప్ మూడు వికెట్లు తీయగా, శ్రీచరణి, షినెలి హెన్రీ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మిన్ను మణి ఓ వికెట్ సాధించింది.
ఆ తరువాత 123 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వార్ట్ (47; 36 బంతుల్లో 7 ఫోర్లు), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (34 నాటౌట్; 18 బంతుల్లో 5 ఫోర్లు), షఫాలీ వర్మ (29; 33 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది.
ఇక మంగళవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు గురువారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో కప్పు కోసం పోటీపడనుంది.
