Zimbabwe all rounder Brad Evans comments ahead of IND vs ZIM match in T20 World Cup 2026
IND vs ZIM : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు (గురువారం, ఫిబ్రవరి 26న) కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు చెన్నైలోని చెపాక్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు జింబాబ్వే కూడా ఈ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించి సెమీస్ రేసులో ఉండాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తమ దృష్టి కేవలం మ్యాచ్ పైనే ఉందని, ప్రత్యర్థి పై ఏమాత్రం లేదన్నాడు. తాము మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్నాడు.
‘నిజంగా టీమ్ఇండియా చాలా గొప్ప జట్టు. అందుకనే వారి పై మేము పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మా బలాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాము. మా ప్రణాళికలను మైదానంలో పక్కగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికే మా బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విభాగాలపై పూర్తిగా చర్చించుకున్నాము. మా బలాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. ప్రత్యర్థి పై కాదు. వారు ప్రపంచంలోని అత్యుత్తమ జట్టలోని ఒకటని మాకు తెలుసు. కాబట్టి మేము మైదానంలో సర్వశక్తులను ఒడ్డుతాం.’అని ఎవాన్స్ అన్నాడు.
వెస్టిండీస్ చేతిలో 107 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో జింబాబ్వే నెట్‌రన్‌రేటును ఘోరంగా దెబ్బతీసింది. ఈ మ్యాచ్ పై ఎవాన్స్ మాట్లాడుతూ.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు భారతదేశంలో ఇదే తొలి టీ20 మ్యాచ్ అని అన్నాడు.
IND vs ZIM : భారత్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?
‘గత మ్యాచ్‌లో మేము అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు. మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు భారతదేశంలో ఇదే తొలి టీ20 మ్యాచ్. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవం ఉన్న జట్టును ఎదుర్కొన్నాము. మ్యాచ్‌లో గెలవలేదు. అయినప్పటికి మా శక్తి మేరకు రాణించేందుకు ప్రయత్నించాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాం. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మా ఉత్తమ ప్రదర్శన చేస్తాం.’అని బ్రాడ్ ఎవాన్స్ చెప్పుకొచ్చాడు.