1980s Vintage Look : 1980 వింటేజ్ లుక్ ట్రెండ్.. జాగ్రత్త గురూ.. మీ ఫోన్ హ్యాక్ అయ్యే చాన్స్..! ఈ జాగ్రత్తలు పాటించాలి..
1980s Vintage Look : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫొటోలను 1980ల నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకోవడం కొత్త ట్రెండ్ వైరల్‌గా మారింది. అయితే, ఇదే క్రేజ్ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
- Harish Thanniru
- Updated on- September 12, 2026 / 11:18 AM IST
1980 Vintage Photo Trend
1980s Vintage Look : సోషల్ మీడియాలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ వైరల్‌గా మారింది. మన ప్రస్తుత ఫొటోలను 1980ల నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకోవడం, బ్లాక్ అండ్ వైట్, సెపియా టోన్, పాతకాలపు దుస్తులు, హెయిర్‌స్టైల్, ఫిల్మ్ కెమెరా ఎఫెక్ట్‌లతో ఫొటోలను రూపొందించుకోవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. యువతతో పాటు అన్ని వయసుల వారు ఈ ట్రెండ్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే, ఇదే క్రేజ్ ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read : Nandamuri Deepika 80s : 80s లుక్స్‌లో ఎన్టీఆర్ అన్నయ్య, వదినమ్మ.. నందమూరి దీపిక – జానకి రామ్ ఫోటోలు వైరల్..
సోషల్ మీడియాలో ఏ ట్రెండ్ వైరల్ అయినా దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడం సైబర్ నేరగాళ్లకు కొత్తేమీ కాదు. ప్రస్తుతం 1980 వింటేజ్ ఫొటో ఎడిటింగ్ ట్రెండ్ విపరీతంగా వైరల్ కావడంతో.. సైబర్ మోసగాళ్లు థర్డ్‌పార్టీ మోబైల్ యాప్‌లు, ఏఐ టూల్స్ పేరిట నకిలీ ఏపీకే లింకులను పరిచయం చేస్తూ మొబైల్ పోన్లలోకి చొరబడుతున్నారు. ఉచితంగా పాతతరం ఫొటోలను రూపొందించి ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నపలు లింకుల వెనుక పెద్ద డిజిటల్ కుట్ర దాగి ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ ఫొటోను 1980ల నాటి చిత్రంలా మార్చుకోండి.. ఫ్రీగా ఏఐ వింటేజ్ ఫొటో తయారు చేసుకోండి.. ఒక్క క్లిక్‌తో రెట్రో స్టైల్ అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న కొన్ని లింకులు యూజర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, వీటిలో కొన్ని సాధారణ ఫొటో ఎడిటింగ్ టూల్స్ కాకుండా.. మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్‌ను చొప్పించేందుకు సైబర్ నేరగాళ్లు రూపొందించిన నకిలీ ఏపీకే ఫైళ్లు ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ వింటేజ్ ఫొటో ఎడిటర్, 80ల నాటి రెట్రో ఫోటో మేకర్, ఓల్డ్ ఫోటో ఏఐ వంటి పేర్లతో నకిలీ అప్లికేషన్లను తయారు చేసి.. వాటి లింకులను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసే అవకాశం ఉంది.
ఉచితంగా ఫొటో మార్చుకోవచ్చు, ప్రీమియం ఫీచర్లు ఫ్రీ, ఎలాంటి వాటర్‌మార్క్ ఉండదు.. వంటి ఆకర్షణీయమైన మాటలతో యూజర్లను క్లిక్ చేయించే ప్రయత్నం చేస్తారు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో సాధారణంగా గూగుల్ ప్లేస్టోర్ వెలుపల నుంచి ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి వస్తే యూజర్ ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఈ ప్రక్రియనే తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయకపోతే ఫొటో జనరేట్ కాదు అంటూ యూజర్‌ను ఒప్పించి ఏపీకే ను డౌన్‌లోడ్ చేయిస్తారు. ఒకసారి హానికరమైన యాప్ ఫోన్‌లోకి వచ్చిన తర్వాత అది అడిగే అనుమతులే అసలు ప్రమాదానికి కారణమవుతాయి.
ఉదాహరణకు అవసరం లేకపోయినా కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్, స్టోరేజ్, నోటిఫికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్ వంటి అనుమతులను అడగవచ్చు. యూజర్ తెలియకుండానే వీటికి అనుమతి ఇస్తే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది.
సురక్షితంగా వింటేజ్ ఫొటో ఎలా తయారు చేసుకోవాలి?
♦ వింటేజ్ ఫొటో ట్రెండ్‌ను ఆస్వాదించాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
♦ యాప్‌లను వీలైనంత వరకు అధికారిక App Store లేదా Google Play Store నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
♦ సోషల్ మీడియాలో వచ్చిన తెలియని ఏపీకే లింకులను క్లిక్ చేయకూడదు.
♦ ఫొటో ఎడిటింగ్ యాప్‌కు అవసరం లేని ఎస్ఎంఎస్, కాంట్రాక్ట్స్, మైక్రోఫోన్ వంటి అనుమతులు ఇవ్వకూడదు.
♦ తెలియని వెబ్‌సైట్లలో వ్యక్తిగత, కుటుంబ, పిల్లల ఫొటోలను అప్‌లోడ్ చేయకుండా ఉండటం మంచిది.
♦ యాప్ పేరు మాత్రమే చూసి నమ్మకుండా డెవలపర్ వివరాలు, రివ్యూలు, డౌన్‌లోడ్‌ల సంఖ్యను పరిశీలించాలి.
♦ ఇప్పటికే అనుమానాస్పద ఏపీకే ఇన్‌స్టాల్ చేసి ఉంటే దాన్ని తొలగించి, ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, ఫోన్ సెక్యూరిటీని పరిశీలించాలి.
