Credit Card Rules ( Image Credit to Original Source )
Credit Card Rules : క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అలర్ట్.. మీకు క్రెడిట్ కార్డు ఉందా? క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కదా అని తెగ ఖర్చు చేసేస్తుంటారు. అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒకటి ఖర్చు చేస్తుంటారు. ఇకపై అలా చేస్తే ఆదాయపు పన్ను శాఖకు తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026 కింద క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి అనేక కీలక మార్పులు రానున్నాయి.
మీరు క్రెడిట్ కార్డును వాడుతుంటే ఇది మీకోసమే. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఒక మిలియన్ (రూ. 10 లక్షలు) లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్లు చేస్తే ఆదాయ పన్ను శాఖకు తెలుస్తుంది.
మీ సంబంధిత బ్యాంక్ లేదా కార్డు చేసిన ఫైనాన్స్ సంస్థ మీరు చేసిన క్రెడిట్ కార్డుల మొత్తం లావాదేవీ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేస్తాయి. అయితే, క్రెడిట్ కార్డుకు సంబంధించి రాబోయే కొత్త నిబంధనలు ఏంటి? మీరేం చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ అడ్రస్ ప్రూఫ్‌గా కూడా వాడుకోవచ్చు. అంటే.. మీరు కొత్త పాన్ కార్డు తీసుకోవాలని అనుకుంటే క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ ప్రూఫ్ గా చూపించుకోవచ్చు.
ఆన్‌లైన్ ఆదాయపు పన్ను చెల్లింపులకు క్రెడిట్ కార్డు కూడా వాడొచ్చు. ఇప్పటి వరకు, ఈ పన్ను చెల్లింపులు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు కాకుండా ఇతర మార్గాల ద్వారా మాత్రమే ఉండేది. ఇకపై అలా ఉండదు. క్రెడిట్ కార్డు ద్వారా టాక్స్ పే చేయొచ్చు.
ముసాయిదా నిబంధనల ప్రకారం.. మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే.. కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లయ్ చేసుకునేటప్పుడు పాన్ కార్డును కూడా అందించడం ఇప్పుడు తప్పనిసరి.
ఒక కంపెనీ తమ ఉద్యోగులకు క్రెడిట్ కార్డు ఇచ్చి ఆ కార్డు బిల్లు కంపెనీయే చెల్లించినట్టు అయితే ఆ ఖర్చు పూర్తిగా అధికారిక పనులకు వాడితే అప్పుడు ఉద్యోగి ఆదాయం కిందకు రాదు. దాంతో వారు ఎలాంటి పన్ను కట్టాల్సిన పనిలేదు.
కానీ, అదే క్రెడిట్ కార్డు ద్వారా వ్యక్తిగత వినియోగం కోసం ఖర్చు చేస్తే ఇప్పుడు ఆ మొత్తాన్ని ఉద్యోగికి జీతంలో భాగంగా పరిగణిస్తారు. ఈ వ్యక్తిగత ఖర్చుపై ఆదాయపు పన్ను విధిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫీస్ వర్క్ కోసం ఖర్చు చేస్తే పన్ను లేదు. వ్యక్తిగత ఖర్చు కోసం చేస్తే మాత్రం పన్ను చెల్లించాలి.