Weather Alert Apps : ఏపీకి ‘అర్నాబ్’ తుఫాన్ టెన్షన్.. క్షణక్షణం వెదర్ అప్‌డేట్ కావాలా? ఈ యాప్స్ మీ ఫోన్‌లో ఉండాల్సిందే!
Weather Alert Apps : బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి ఏపీ తీరం దాటే దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో మీ ఫోన్లో ఖచ్చితంగా ఉండాల్సిన వాతావరణ, విపత్తు హెచ్చరిక యాప్స్ ఇవే..
- Sreehari A
- Updated on- September 22, 2026 / 08:31 PM IST
Cyclone Arnab Alert
- వర్షం ఎప్పుడు పడుతుందో టెన్షన్ వద్దు..
- ఈ యాప్స్‌తో ముందే తెలుసుకోండి
- వర్షం ముంచెత్తే ముందు అలర్ట్ అవ్వండి
- ఒక్క ఫోన్‌లోనే పూర్తి వెదర్ అప్‌డేట్స్
Weather Alert Apps : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో తుఫాను ముంచుకొస్తోంది.. అదే అర్నాబ్ తుఫాను.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారుతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సెప్టెంబర్ 22 ఉదయానికి గోపాల్‌పూర్‌కు ఆగ్నేయంగా 200 కి.మీ, విశాఖపట్నానికి తూర్పున 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడనుంది. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా. ఇది మరింత బలపడితే ‘అర్నాబ్’ తుఫానుగా మారనుంది.
ఈ ప్రభావంతో కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దలు అనవసరంగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల్లో వర్షం ఎప్పుడు పడుతుంది, ఎంత సేపు ఉంటుంది అనేది ముందే తెలిస్తే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఈజీ. అందుకే ఈ వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్‌లో ఈ వెదర్ యాప్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.. ఇంతకీ అవేంటో పూర్తి లిస్టులో చూద్దాం..
ది వెదర్ ఛానల్ (The Weather Channel) :
ఈ వెదర్ యాప్ మీ ఫోన్లో ఉందా? లేదంటే ఇప్పుడే ఇన్ స్టాల్ చేసుకోండి. గంటగంటకు టెంపరేచర్, రోజంతా వర్షం పడుతుందా లేదా అనే కచ్చితమైన వివరాలు, వాతావరణ రాడార్, హెచ్చరికలతో పాటు హెల్త్, లైఫ్‌స్టయిల్ వార్తలు కూడా ఇందులో చూడొచ్చు.
గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో ఫ్రీగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ వెర్షన్‌లో యాడ్స్ ఉంటాయి. యాడ్స్ లేకుండా కావాలంటే నెలకు 1.99 డాలర్లు, ఏడాదికి 9.99 డాలర్లు చెల్లించాలి. ప్రీమియం వెర్షన్ నెలకు 4.99 డాలర్లు, అదే ఏడాదికి 29.99 డాలర్లు (రూ. 2,633) చెల్లించాల్సి ఉంటుంది.
అక్యూవెదర్ (AccuWeather) :
ఈ యాప్ ‘మినిట్‌క్యాస్ట్’ ఫీచర్‌తో వస్తుంది. రాబోయే 2 గంటల్లో నిమిషానికి నిమిషానికి వర్ష సూచనలను అందిస్తుంది. వర్షం ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు ఆగుతుంది, నిర్దిష్ట సమయంలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో టక్కున చెప్పేస్తుంది.
ఫ్రీ వెర్షన్‌లో అనేక ఫీచర్లు ఉండగా, ప్రీమియం వెర్షన్ వాతావరణ నిపుణుల విశ్లేషణ, హైపర్-లోకల్ ఫీచర్లను అందిస్తుంది. ప్రీమియం వెర్షన్ 7 రోజులు ఫ్రీ ట్రయల్ తర్వాత నెలకు 1.99 డాలర్లు, ఏడాదికి 12.99 డాలర్లు చెల్లించాలి. ప్రీమియం ప్లస్ వెర్షన్ నెలకు 3.99 డాలర్లు, ఏడాదికి 24.99 డాలర్లు (రూ. 2,194) చెల్లించాలి.
వెదర్‌బగ్ (WeatherBug) :
ప్రాంతీయ వర్ష సూచనలు, వాతావరణ హెచ్చరికలను ఈ యాప్ అందిస్తుంది. రియల్-టైమ్ డేటాను నేరుగా చూపిస్తుంది. పిడుగులతో వర్ష హెచ్చరికలు, గంటవారీ నుంచి 10 రోజుల అంచనాలు, రెయిన్ రాడార్, తుఫాను ముప్పు మ్యాప్ లేయర్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఫ్రీ వెర్షన్‌లో రియల్ టైమ్ అంచనాలు, తీవ్రమైన హెచ్చరికలు పొందవచ్చు. ప్రీమియం వెర్షన్ యాడ్-ఫ్రీ వ్యూతో పాటు అడ్వాన్స్ యాక్టివిటీలను అందిస్తుంది. ఈ యాప్ కోసం నెలకు రూ.199, ఏడాదికి రూ.999 చెల్లించాలి.
వెదర్ అండర్‌గ్రౌండ్ (Weather Underground) :
ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, రాడార్ ఫొటోలు, తీవ్రమైన హెచ్చరికలను అందించే ఈ యాప్ ప్రధాన నగరాల రియల్ టైమ్ వెదర్ రిపోర్టులను, కమ్యూనిటీ ఆధారిత వాతావరణ సమాచారాన్ని కూడా ఇస్తుంది. యాడ్-ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కోసం ఏడాదికి 9.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వివిధ వెబ్‌సైట్‌లు, వార్తాపత్రికలకు స్థానిక వాతావరణ రిపోర్టులను కూడా అందిస్తుంది.
ది వెదర్ (Mausam) :
భారత వాతావరణ శాఖ (IMD) రూపొందించిన ఈ యాప్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రియల్ టైమ్ అప్‌డేట్స్, తీవ్రమైన హెచ్చరికలను అందిస్తుంది. రోజువారీ, గంటవారీ సూచనలు, రాడార్, పీడనం వంటి వివరాలు కూడా లభిస్తాయి.
తెలుగుతో సహా 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ ప్రభుత్వ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తుఫాను తీరం దాటే వరకూ ఈ యాప్స్‌ను ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకుని అలర్ట్‌గా ఉండటం మంచిది.
