Diamond Lotus : అంతరిక్షంలో వికసించనున్న వజ్ర కమలం.. విక్రమ్-1తో భారత్ కొత్త చరిత్ర!
Diamond Lotus : భారత తొలి 'వజ్ర కమలం' అంతరిక్షంలో ప్రకాశించనుంది. ఈ అద్భుతమైన వజ్ర కమలాన్ని అంతరిక్షంలోకి ఎందుకు పంపుతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- July 10, 2026 / 05:33 PM IST
Diamond Lotus
- వజ్ర కమలం నుంచి అంతరిక్షం వరకు.. స్పేస్ రంగంలో మరో సంచలనం
- ‘డైమండ్ లోటస్’ స్పేస్ మిషన్.. భారత ప్రైవేట్ రాకెట్‌తో అరుదైన ప్రయాణం
- విక్రమ్-1తో అంతరిక్షంలోకి వజ్ర కమలం.. భారత్ మరోసారి వార్తల్లో!
Diamond Lotus : అంతరిక్షంలో వజ్ర కమలం.. ఈ పేరు వింటేనే చాలా కొత్తగా ఉంది కదా.. ఎంతో ప్రత్యేకమైన వజ్ర కమలాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ రెడీ అవుతోంది. అతి త్వరలో
భారత అంతరిక్ష రంగం వజ్ర కమలంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
ఈసారి అంతరిక్షంలో చరిత్ర సృష్టించబోయేది కేవలం రాకెట్ కాదు.. ఫస్ట్ టైమ్ వికసించబోతున్న ఓ వజ్ర కమలం. అవును మీరు చదివింది నిజమే.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 చారిత్రాత్మక తొలి ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.
ఈ రాకెట్‌లో డైమండ్ లోటస్ కూడా వెళ్లబోతుంది. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాస్త్రం, సంస్కృతి, కళతో ఈ మూడింటి అద్భుతమే వజ్ర కమలం.. భారత ఆవిష్కరణకు సరికొత్త గుర్తింపుగా తీసుకురానుంది.
అంతరిక్షంలోకి వెళ్లనున్న వజ్రకమలం :
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ కాస్మోస్ డైమండ్స్ ఈ ల్యాబ్-గ్రోన్ డైమండ్ కమలాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. ల్యాబ్‌లో తయారైన స్వదేశీ వజ్రకమలం అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.
వాస్తవానికి, ముందుగా భారీ వజ్రం లేదా స్పెషల్ రత్నాలతో తయారైన వస్తువును పంపాలని భావించగా, చివరికి భారత జాతీయ పుష్పమైన తామరనే ఈ ప్రయోగానికి ఎంపిక చేసింది. భారతీయ సంస్కృతిలో తామర స్వచ్ఛత, జ్ఞానం, సృష్టికి ప్రతీకగా చెబుతారు. ఈ కమలం మధ్యలో బంగారంతో రూపొందించిన భాగం దేవతా స్థానంగా భావిస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేవలం కళాఖండం మాత్రమే కాదు. అత్యాధునిక శాస్త్ర, ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం కూడా. సాధారణంగా రాకెట్ ప్రయోగించే సమయంలో ప్రకంపనలు, ఒత్తిడులు తీవ్రంగా ఉంటాయి.
అలాగే, అంతరిక్షంలోని కఠిన పరిస్థితులను తట్టుకునేలా డైమండ్ లోటస్‌పై ప్రత్యేకమైన నిర్మాణ పరీక్షలు కూడా నిర్వహించారు. వజ్రంతో రూపొందించిన ఈ కమలం ప్రయోగ సమయంలో దెబ్బతినకుండా ఉండేలా ఇంజనీర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
భారత ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ :
ఈ అద్భుతమైన కళాఖండం పేలోడ్‌ను మోసుకెళ్తున్న విక్రమ్-1 రాకెట్‌ను భారత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ డెవలప్ చేసింది. భూ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టే లక్ష్యంతో రూపొందించిన భారత ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ కూడా ఇదే.
డైమండ్ లోటస్ శాస్త్రీయ పేలోడ్ కాదు. అయినా ప్రపంచానికి భారతీయ సృజనాత్మకత, సాంకేతిక సామర్థ్యం, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతోంది. తద్వారా భారత అంతరిక్ష చరిత్రలో చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచిపోనుంది.
