Sarvam AI
Sarvam AI: మన దేశ “సర్వమ్ ఏఐ” మూడు కీలక అంశాలలో చాట్‌జీపీటీని మించిపోయింది. ఇప్పటివరకు మన దేశంలో ఇతర దేశాలకు చెందిన ఏఐ సంస్థలదే ఆధిపత్యం. అయితే, ఇకపై మనదేశంలో ఏఐ ఇక కేవలం ప్రపంచ స్థాయి ఏఐ సంస్థల కార్యాలయాలు లేదా డేటా కేంద్రాల ఏర్పాటుకు మాత్రమే పరిమితం కాదని స్పష్టం అవుతుంది.
బెంగళూరులో ప్రారంభమైన ఒక స్టార్టప్ సాధించిన అభివృద్ధే ఈ అంచనాలను పెంచేసింది. “సర్వమ్ ఏఐ” పూర్తిగా భారతదేశంలోనే రూపొందింది. భారతీయ వినియోగదారులపైనే అధికంగా దృష్టి పెట్టి సర్వమ్ ఏఐను అభివృద్ధి చేశారు. కొన్ని అత్యంత కీలకమైన రంగాలలో చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై లాంటి ప్రపంచ దిగ్గజాలను మించగలదని నిరూపిస్తోంది.
ఈ మూడింటిలో చాట్‌జీపీటీని మించిపోయింది..
ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ కచ్చితత్వం
డాక్యుమెంట్లను చదవడం, ఓసీఆర్ విషయంలో చాట్‌జీపీటీ కంటే సర్వమ్ ఏఐ స్పష్టంగా మెరుగైన ఫలితాలు చూపిస్తోంది. సర్వమ్ విజన్ అనే సాధనం ఒల్మ్ ఓసీఆర్ బెంచ్, ఓమ్నీడాక్ బెంచ్ లాంటి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచింది. క్లిష్టమైన లేఅవుట్లు, సాంకేతిక టేబుల్స్, గణిత సూత్రాలు, స్కాన్ చేసిన ఫామ్‌లు, మిశ్రమ భాషా పత్రాలను ఇది మరింత కచ్చితంగా గుర్తిస్తుంది. భారతదేశానికి చెందిన ప్రభుత్వ ఫామ్‌లు, ఇన్వాయిస్‌లు, నివేదికల లాంటి వినియోగాల్లో ఇది విశ్వసనీయంగా మారింది. ఓసీఆర్ అంటూ చిత్రాలు లేదా స్కాన్ పత్రాలలోని అక్షరాలను పాఠ్యంగా మార్చే సాంకేతికత.
భారతీయ భాషల వాయిస్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు వాయిస్ సామర్థ్యం
భారతీయ భాషలు, భారతీయ ఉచ్చారణల విషయంలో సర్వమ్ ఏఐ స్పష్టంగా ముందంజలో ఉంది. వాయిస్ టు టెక్స్ట్ మరింత కచ్చితంగా పనిచేస్తుంది. టెక్స్ట్ టు వాయిస్ సహజంగా వినిపిస్తుంది. హింగ్లిష్ (హిందీ పదాలు, ఇంగ్లిష్ పదాలను కలిపి మాట్లాడే భాషా శైలి), ప్రాంతీయ ఉచ్చారణ శైలులను ఇది బాగా అర్థం చేసుకుంటుంది. ఈ స్థాయి కచ్చితత్వంలో చాట్‌జీపీలో ఇంకా లేదు.
స్పష్టమైన ఆధిక్యం
భారతీయ భాషా నమూనాలు, లిపులు, మిశ్రమ భాషా వినియోగాన్ని సర్వమ్ ఏఐ చాట్‌జీపీటీకంటే మెరుగుగా గ్రహిస్తుంది. అనేక భారతీయ భాషలు, ఇంగ్లిష్ పాఠ్యం, నిర్మిత డేటా కలిసిన పత్రాలపై ఇది ప్రత్యేకంగా మెరుగైన పనితనం చూపిస్తుంది. కస్టమర్ సపోర్ట్, పత్రాల ప్రాసెసింగ్, సంస్థల వినియోగాల్లో దీనికి స్పష్టమైన ఆధిక్యం ఉంది.