మనిషి జీవనసరళిలో ఇంటర్నెట్ ఓ భాగం కావడం కాదు. ఇంటర్నెట్ లేనిదే మనిషి మనుగడే స్తంభించిపోతుందనే స్థాయికి చేరింది. ఇంటర్నెట్ అవసరాల కోసం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను వాడుకునే యూజర్లు ఇప్పుడు అన్ని సదుపాయాలు ఫోన్లలోనే దొరుకుతుండటంతో వేలు కుమ్మరించి వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా చూసుకుంటున్న హ్యాకర్లు మెయిల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, బ్యాంకింగ్ యాప్‌లను టార్గెట్ చేసుకుని దోచేసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదో ఒక రూపేణా ఈ సాఫ్ట్‌వేర్ దొంగలు ఫోన్లలో డేటాను దొంగిలించేస్తున్నారు.
అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ.. హ్యాకింగ్‌కు వీలుకాని క్రిప్టో ఫోన్‌ను రష్యాకు చెందిన రోస్టెక్ అనే సంస్థ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌తో హ్యాకర్లకు సవాల్ విసురుతూ హ్యాక్, వైర్‌టాప్ చేయడం అసాధ్యమని చెబుతోంది. రష్యాకు చెందిన రోస్‌టెక్ సంస్థ క్రూయిజ్-కె పేరుతో ఒక స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర 1,298 డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.93వేల రూపాయలన్న మాట.
ఈ ఫోన్‌ను ఎవరిపడితే వారికి అమ్మేయరు. ఏవైనా సంస్థలు మాత్రమే ఆర్డర్‌పై వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసు సంస్థ ఆమోదించిన సాంకేతిక వివరాలను ఇచ్చేందుకు రోస్‌టెక్ నిరాకరించింది. దీనికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎవటోమేటికా అనే రోస్‌టెక్ అనుబంధ సంస్థ అభివృద్ధి చేసింది.
రష్యాలో ఇదే తొలి క్రిప్టో ఫోన్. చివరిగా గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ ఫోన్ వినియోగించే వ్యక్తితో మాట్లాడాలంటే అటు వైపు వ్యక్తి కూడా ఇటువంటి ఐపీ ఫోన్‌నే వినియోగించాలి.