SIM Binding Rule
SIM Binding Rule : మీరు వాట్సాప్, టెలిగ్రామ్ వాడుతున్నారా? అయితే, మీకోసం బిగ్ అప్‌డేట్.. వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగంపై మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనలతో వినియోగదారులకు సమస్యలు తలెత్తవచ్చు. సిమ్-బైండింగ్ నియమానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కొన్ని నివేదికల ప్రకారం.. మెసేజింగ్ యాప్ ప్లాట్ ఫారాలు తమ అకౌంట్లను సిమ్ కార్డుకు లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా సహించే ప్రసక్తి లేదని తెలిపింది. అంతేకాదు.. మార్చి 1, 2026 గడువుకు సంబంధించి ప్రభుత్వం కూడా కఠినమైన వైఖరిని అమలు చేయనుంది.
మరోవైపు.. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఓటీటీ మెసేజింగ్ యాప్‌లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వినియోగదారుల వాట్సాప్ అకౌంట్లు తప్పనిసరిగా యాక్టివ్ సిమ్ కార్డుకు లింక్ అయి ఉండాలని సూచించింది. అలా చేయకపోతే వాట్సాప్ సర్వీసులు నిలిచిపోతాయి.
వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు నవంబర్ 28న భారత టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT) అధికారికంగా తమ సర్వీసులకు యూజర్ మొబైల్ ఫోన్‌లో రిజిస్టర్డ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (SIM) కార్డ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేసేలా సెట్ చేయాలని ఆదేశించింది.
ఈ ఆర్డర్‌ను పాటించేందుకు సోషల్ యాప్ కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పుడు ఆ గడువు ఫిబ్రవరి 28తో ముగుస్తుంది. 120 రోజుల్లోగా కాన్సెంట్ రిపోర్టును సమర్పించాలి. కొత్త నిబంధన మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది.
కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. మీ ఫోన్‌లో సిమ్ కార్డ్ లేకుంటే వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లింక్ అయి ఉంటే ఆ యాప్ పరిమితంగానే వాడగలరు. అలాంటి పరిస్థితిలో మీ ఫోన్‌లోని వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌లు కూడా పనిచేయవు.
వాస్తవానికి, భారత్‌లో అత్యధిక సంఖ్యలో వాట్సాప్ యూజర్లు ఉన్నారు. ఒకే నంబర్‌కు లింక్ చేసిన వేర్వేరు డివైజ్‌లలో వాట్సాప్ వాడుతున్నారు. కానీ ఇకపై ఇలా జరగదు. మల్టీ డివైజ్‌ల్లో ఒకే అకౌంట్ యాక్టివేట్ చేసిన మిలియన్ల మంది యూజర్లకు వాట్సాప్ ఇకపై పనిచేయదు.
భద్రత అన్నింటికన్నా చాలా ముఖ్యమని సిమ్-బైండింగ్ నియమాలలో ఎలాంటి మార్పు ఉండదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. డిజిటల్ మోసం, ఫేక్ నంబర్ల ద్వారా జరిగే నేరాలను నిరోధించేందుకు ఈ రూల్ తప్పనిసరి చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
ఒక యూజర్ అదే సిమ్ కార్డుతో మరో డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయడం లేదా తరచుగా సిమ్ కార్డులను మారుస్తుంటే ప్రతి 6 గంటలకు యాప్ లాగ్ అవుట్ అవుతుంది. ఇందుకోసం QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దాంతో 60 శాతం నుంచి 80 శాతం వరకు బిజినెస్ యాక్టివిటీస్‌పై ప్రభావం పడుతుంది.
సిమ్ కార్డు తీస్తే వాట్సాప్ ఆటో షట్‌డౌన్ :
వాట్సాప్ లింక్డ్ డివైజెస్ ఫీచర్ అనేది ఒకే మొబైల్ నెంబర్ ద్వారా మల్టీ డివైజ్‌ల్లో వర్క్ అవుతుంది. కానీ, కొత్త సిమ్ బైండింగ్ రూల్ ప్రకారం ఇకపై లిమిటెడ్ మాత్రమే. అంటే లింక్డ్ డివైజ్ ఫీచర్ పూర్తిగా నిలిచిపోదు. వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు వాడిన సిమ్ కార్డ్ ఉన్న ఫోన్‌లో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది.
ఏదైనా కారణంతో డివైజ్ నుంచి సిమ్ కార్డ్ రిమూవ్ చేస్తే ఆ వాట్సాప్ ఆటోమాటిక్‌గా షట్ డౌన్ అవుతుంది. ప్రస్తుతం, వాట్సాప్ 14 రోజుల పాటు లింక్ అయి ఉంటుంది. అయితే, ఈ కొత్త సిమ్ బైండింగ్ రూల్ అమల్లోకి వచ్చాక వెంటనే లాగౌట్ అయిపోతుంది.