దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 36వేల 921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1223 మంది కరోనాతో చనిపోయారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు.
నో మాస్క్ నో పెట్రోల్, నో మాస్క్ నో రేషన్ నిబంధనలు అందులో భాగమే. అంటే, మాస్క్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తారు. లేదంటే వెనక్కి పంపేస్తారన్నమాట. రేషన్ షాపులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ముఖానికి మాస్క్ ఉంటేనే రేషన్ ఇస్తారు. లేదంటే వెనక్కి పంపుతారు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నాయి.(కరోనా ఎఫెక్ట్, పెట్రోల్ బంకులు, రేషన్ షాపుల్లో కొత్త రూల్)
ఇక ఇప్పుడు బ్యాంకుల వంతు వచ్చింది. కరోనా వ్యాప్తి కట్టడికి బ్యాంకులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఏటీఎంల విషయంలో. బ్యాంకు ఏటీఎంలు, పెన్షన్‌దారులకు సంబంధించి మే 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
* కరోనా నేపథ్యంలో ఏటీఎంను వినియోగించిన ప్రతిసారి శుభ్రం చేయాలి.
* హాట్‌స్పాట్ ప్రాంతాల్లోని ఏటీఎంలను స్థానిక మున్సిపల్ సిబ్బంది రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయాల్సి ఉంటుంది.
* ఈ నిబంధన పాటించని ఏటీఎం కేంద్రాలను మూసివేస్తారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. మరోవైపు ఉద్యోగ విరమణ అనంతరం కొన్నేళ్ల తర్వాత పూర్తి పెన్షన్ వచ్చే విధానాన్ని ఎంచుకున్న వారికి మే 1 నుంచి ఆ మేరకు ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో చెల్లించనుంది. కరోనా కష్టకాలంలో 6,30,000 మంది లబ్ధి పొందనుండగా కేంద్ర ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల భారం పడనుంది. ప్రైవేటు యాజమాన్యాలకు కూడా కొంత ఊరట లభించింది.
డబ్బు డ్రా చేసేందుకు అంతా ఏటీఎం కేంద్రాలకు వెళ్తుంటారు. తమ చేతులతో వాటిని టచ్ చేస్తారు. అయితే వారిలో ఎవరికైనా కరోనా ఉండి ఉంటే, అది ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. కరోనా వ్యాప్తికి ఏటీఎంలు ప్రధాన కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న బ్యాంకులు కొత్త నిబంధన తీసుకొచ్చాయి. ఏటీఎం కేంద్రాలను శానిటైజ్ చేయాలని రూల్ పెట్టారు. ఆ విధంగా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నాయి.
నో మాస్క్.. నో పెట్రోల్, రేషన్
అటు రాష్ట్రంలో పెద్గా కరోనా కేసులు లేకున్నా గోవా ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటోంది. కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఫేస్‌మాస్క్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారికి పెట్రోల్, రేషన్ దుకాణాల్లో రేషన్ ఇవ్వరాదని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గోవా వ్యాప్తంగా ’నో మాస్క్- నో పెట్రోల్’, ‘నో మాస్క్- నో రేషన్’ ప్రచారోద్యమం చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు ఫేస్‌మాస్క్‌లు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా 33లక్షల 98వేల కేసులు, 2లక్షల 39వేల మరణాలు:
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కంటికి కనిపించని శత్రువు లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. ఈ వైరస్ దాడితో అగ్రరాజ్యం అమెరికా గజగజ వణికిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో 2లక్షల 39వేల 586 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 33లక్షల 98వేలకు చేరుకుంది. ఈ వైరస్ నుంచి కోలుకుని 10లక్షల 80వేల మందికి పైగా డిశ్చార్జి అయ్యారు.
అమెరికాలో 65,766 మంది, స్పెయిన్‌లో 24,824, ఇటలీలో 28,236, యూకేలో 27,510, ఫ్రాన్స్‌లో 24,594, జర్మనీలో 6,736, టర్కీలో 3,258, రష్యాలో 1,169, ఇరాన్‌లో 6,091, బ్రెజిల్‌లో 6,410, చైనాలో 4,633, కెనడాలో 3,391, బెల్జియంలో 7,703, నెదర్లాండ్స్‌లో 4,893, ఇండియాలో 1,223, స్విట్జర్లాండ్‌లో 1,754 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.