Telangana : రైతులకు గుడ్‌న్యూస్.. యూరియా కష్టాలు తీరనున్నాయ్.. యూరియా వచ్చేస్తుంది..
తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది.

Telangana Urea
Telangana Urea Deficiency : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా వర్షాలు పడుతుండటంతో యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. అయితే, యూరియా కొరత సమస్యాత్మకంగా మారింది. గతంలో మాదిరిగా కేటాయింపులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం యూరియాను సరఫరా చేయకపోవడం, కోటాలో నెలనెలా కోతలు విధిస్తుండటంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అయితే, తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారం రోజుల్లో యూరియా కష్టాలు తొలగిపోనున్నాయని తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది 1.15కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఎరువులను అధికంగా వాడే పత్తి దాదాపు లక్ష్యం మేరకు, మొక్కజొన్న విస్తీర్ణం కంటే అధికంగా సాగు చేస్తున్నారు. దీంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో యూరియా కొరతతో రైతులు దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో యూరియా కోసం తెల్లవారుజామున మూడు గంటల నుంచే రైతులు క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. మహబూబాబాద్‌లో జోరు వర్షంలోనూ యూరియా కోసం రైతులు క్యూలైన్లలో వేచి ఉంటున్న పరిస్థితి.
మరోవైపు వరంగల్ జిల్లా కానాపురం మండలం బుధరావుపేట, మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా సరఫరా చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. యూరియా కోసం ప్రధాన జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. రైతుల ఇబ్బందులపై స్పందించని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
Also Read: Andhra Pradesh MLAs: ఎమ్మెల్యేలూ జాగ్రత్త.. సోషల్ మీడియా ఇరికిస్తుంది.. ఇప్పటికే ఏం జరిగిందంటే?
యూరియా వచ్చేస్తుంది..
డిమాండ్‌కు సరిపడా యూరియాను తెప్పించేందుకు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండు సార్లు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏడు సార్లు కేంద్రానికి లేఖలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. అదేవిధంగా డిమాండ్‌కు సరిపడా యూరియాను రాష్ట్రానికి సరఫరా చేసేలా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల యూరియా పోరాటం ఫలించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది.
కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్‌మెంట్ ప్రారంభమైంది. ఈ వారంలో మరో మూడు షిప్‌మెంట్‌ల ద్వారా యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఆదేశాలు వెళ్లాయి. యూరియా కొరత పై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలపై దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు.
ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థంకోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలని, తెలంగాణకు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులకు ఇబ్బందులు తలెత్తాయని తుమ్మల అన్నారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగంకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.