Bribe: రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీసులు..

ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. 33.97 లక్షల రూపాయల నగదు కనుగొన్నారు. ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

  • Published On : April 8, 2026 / 05:13 PM IST

 

Bribe: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే అడ్డదారి తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. లంచాలకు రుచి మరిగి పోలీస్ వ్యవస్థకే కళంకం తెచ్చారు. లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ ఔట్ పోస్ట్ లో లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు ఇన్ స్పెక్టర్ సంపతి కనకయ్య కాగా మరొకరు సబ్ ఇన్ స్పెక్టర్ సిద్దేశ్వర్.

ఏసీబీ అధికారుల ప్రకారం ఛార్జిషీట్ దాఖలు, ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులను కేసులో ఇరికించకుండా ఉండటం / అరెస్టు చేయకుండా ఉండేందుకు గాను ఈ ఇద్దరు పోలీసులు 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బాధితుడి నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

పోలీసులు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఉచ్చు పన్నారు. రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ నివాసంలో సోదాలు నిర్వహించారు. 33.97 లక్షల రూపాయల నగదు కనుగొన్నారు. ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. స్పెషల్ కోర్టు ముందు వారిని హాజరుపరచనుంది.

ఏదైనా పని చేసి పెట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే బాధితులు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదు ఇచ్చిన బాధితుల పేరు, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Also Read: హైదరాబాద్ లో ఘోరం.. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి