Lemon Price Hike : నిన్న చెక్కర, ఉల్లి.. నేడు నిమ్మ.. ధరలకు రెక్కలొస్తున్నాయ్.. ఇక సామాన్యులకు చుక్కలే!
Lemon Price Hike : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరల భారం క్రమంగా పెరుగుతోంది.
- Harish Thanniru
- Published on- August 26, 2026 / 02:30 PM IST
Lemon Price Hike
Lemon Price Hike : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరల భారం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే వంట నూనెలు, ఇతర నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరగ్గా.. చక్కెర, ఉల్లిపాయల ధరలు కూడా పెరిగాయి.. తాజాగా.. ఈ బాటలో నిమ్మకాయ కూడా చేరింది. నిమ్మ ధరలుసైతం ఒక్కసారిగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ మార్కెట్లో ఉల్లి, పంచదార ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో రోజువారీ కిరాణాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో కిలో రూ.25 నుంచి రూ.35 మధ్య లభించిన ఉల్లిపాయలు.. ప్రస్తుతం.. కిలో రూ.55 నుంచి రూ.70 వరకు చేరింది. అలాగే చెక్కర ధర కూడా పెరిగింది. గతంలో కిలో చెక్కర రూ.45 నుంచి రూ.48 వరకు ఉండగా.. ప్రస్తుతం కిలో చెక్కర రూ. 65 నుంచి రూ. 70కి పెరిగింది. ఇదేబాటలో నిమ్మకాయ కూడా చేరింది. నిమ్మకాయ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడులు తగ్గడం, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయి. ఏప్రిల్, మే నెలల్లో డజను ధర రూ. 100 పలికింది. జూన్, జులై నెలల్లో రూ.30 నుంచి రూ. 40వరకు చేరింది. అయితే, నాలుగైదు రోజుల నుంచి నిమ్మ ధర రికార్డు స్థాయిలో పెరగడమే కాకుండా ఏకంగా డజను రూ. 120కు చేరడంతో వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరగడంతో అల్లాడుతున్న వినియోగదారునికి ఆకాశాన్నంటుతున్న నిమ్మ ధరలు శరాఘాతంగా మారాయి.
