Egg Prices : ఇథనాల్ వల్ల పెరుగుతున్న గుడ్ల ధరలు.. దానికి దీనికి సంబంధం ఏమిటి..? అసలు సమస్య ఇదే..
Ethanol Effect Egg Prices Hike : దేశవ్యాప్తంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు కారణంగా ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నను పెద్ద మొత్తంలో తరలించడమేనని వ్యాపారులు చెబుతున్నారు.
Ethanol Effect Egg Prices Hike
Ethanol Effect Egg Prices Hike : దేశవ్యాప్తంగా కోడి గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వీటి ధరలు 40శాతంమేర పెరిగినట్లు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పౌల్ట్రీ వ్యాపారుల వద్ద ఒక్క కోడిగుడ్డు ధర సుమారు రూ.7 ఉండగా.. రిటైల్ మార్కెట్లో రూ.8.50 నుంచి రూ.9 వరకు పలుకుతోంది.
Also Read : Telangana Rains : రెయిన్ అలర్ట్.. హైదరాబాద్‌సహా తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
గుడ్డు ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇథనాల్ అని పేర్కొంటున్నారు. ఇథనాల్ తయారీకి.. కోడిగుడ్ల ధర పెరుగుదలకు సంబంధం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ఇందుకు కారణాలు ఉన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇథనాల్ ను ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, బియ్యం, పిండి పదార్థాలు ఉన్న వనరుల ద్వారా తయారు చేస్తారు. ఎక్కువగా చెరకు, మొక్కజొన్నను వినియోగిస్తారు.
కోడిగుడ్ల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నను పెద్దమొత్తంలో మళ్లించడం. ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (E20) కలపడాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది. దీంతో కోళ్ల దాణాకు అవసరమైన మొక్కజొన్న లభ్యత తగ్గి.. దాణా ధరలు పెరిగాయి. మొక్కజొన్నతో పాటు సోయాబీన్ ధరలు పెరిగితే కోళ్ల దాణా ఖర్చు కూడా పెరుగుతుంది. చివరకు ఆ ప్రభావం గుడ్లు, చికెన్ ధరలపై పడుతుంది.
మొక్కజొన్న ధర ప్రస్తుతం టన్నుకు సుమారు రూ.26,500కు చేరింది. మూడేళ్ల క్రితం ఇది సుమారు రూ.14వేలుగా ఉండేది. గత ఐదు నెలల్లోనే మొక్కజొన్న ధర దాదాపు 20శాతం పెరిగింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొక్కజొన్నలో సుమారు 60శాతం పౌల్ట్రీ పరిశ్రమకు అవసరమవుతుండటంతో.. ప్రస్తుతం ఇథనాల్ తయారీకి మొక్కజొన్న వినియోగం పెద్దమొత్తంలో తరలుతోంది.
ఈ క్రమంలో కోళ్ల దాణాకు కొరత ఏర్పడుతోంది. దీంతో దాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా పౌల్ట్రీ వ్యాపారులు గుడ్డు ధరలను ఆమాంతం పెంచేస్తున్నారు. దీనికితోడు ఈ ప్రభావం చికెన్ ధరలపైనా ప్రభావం చూపుతోంది. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే.. గుడ్డు, చికెన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు.
