Summer Holidays Extended : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆ కాలేజీలకు సెలవులు పొడిగింపు..
Summer Holidays Extended : తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- Dharani Pilli
- Updated on- June 1, 2026 / 12:18 PM IST
Amid Intense Heatwave Extends Summer Holidays for Degree and PG Colleges in telangana
Summer Holidays Extended : తెలంగాణ సర్కార్.. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటం, వడగాడ్పులు వీస్తుండటంతో ఉదయం 9 గంటలు దాటితే బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు భారీ ఊరటనిచ్చే వార్త చెప్పాయి. కాలేజీల వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి ఈ కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే తీవ్రమైన ఎండల దృష్ట్యా సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగించారు.
*ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. కళాశాలల పున:ప్రారంభం తేదీలో మార్పు
రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిధిలోని క్యాంపస్, కాన్‌స్టిట్యుయెంట్ (అనుబంధ), అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటికీ ఈ సెలవుల పొడిగింపు వర్తిస్తుంది. ఇదిలా ఉంటే ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు.. ఈ మూడు విశ్వవిద్యాలయాలు జూన్ 6 వరకు సెలవులను పొడిగిస్తూ అధికారిక ప్రకటన జారీ చేశాయి. ఈ కాలేజీలు మళ్లీ జూన్ 8 (సోమవారం) నాడు పునఃప్రారంభం కానున్నాయి. వీటితో పాటు కాకతీయ, శాతవాహన యూనివర్సిటీలు జూన్ 5వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగించాయి. ఇవి తిరిగి జూన్ 6 నుంచే ప్రారంభం కానున్నాయి.
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కు మినహాయింపు లేదు
ఈ సెలవుల పొడిగింపు నిర్ణయం కేవలం విద్యార్థులు, సాధారణ ఫ్యాకల్టీకి మాత్రమే వర్తిస్తుంది. కాలేజీల ప్రిన్సిపాల్స్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో ఉన్న అధ్యాపకులు మాత్రం యథావిధిగా విధులకు హాజరుకావాలని యూనివర్సిటీలు స్పష్టం చేశాయి. కాలేజీల అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ పనులను సజావుగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు తొలుగ.. మే 1 నుంచి మే 31 వరకు మాత్రమే సెలవులు ప్రకటించాయి. కానీ ఇప్పుడు పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ఎండల తీవ్రత తగ్గకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
