Bandi Bhagirath : చర్లపల్లి జైలుకు బండి భగీరథ్.. 14రోజులు రిమాండ్.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్

Bandi Bhagirath : పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మేడ్చల్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరపర్చగా.. 14రోజుల రిమాండ్ విధించారు. భగీరథ్‌ను పోలీసులు రాత్రి 12గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు.

Bandi Bhagirath

  • బండి భగీరథ్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • 14రోజులు రిమాండ్ విధించిన కోర్టు
  • చర్లపల్లి జైలుకు తరలింపు..
  • నా కుమారుడిని పోలీసులకు తానే అప్పగించానంటూ బండి సంజయ్‌ ప్రకటన

Bandi Bhagirath : పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి పోలీస్ అకాడమీ (అప్పా జంక్షన్) సమీపంలో భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా షేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. అరెస్టును ప్రకటించిన తరువాత భగీరథ్‌కు తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేడ్చల్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. 14రోజుల రిమాండ్ విధించారు. భగీరథ్‌ను పోలీసులు రాత్రి 12గంటల సమయంలో చర్లపల్లి జైలుకు తరలించారు.

Also Read : Gold silver Price Today : ఆహా.. అదిరిపోయే శుభవార్త.. వరుసగా రెండోరోజు కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

భగీరథ్ అరెస్టుకు ముందు హైడ్రామా నడిచింది. పోక్సో కేసులో ముందుస్తు బెయిల్ కోసం, అరెస్టు నుంచి రక్షణకు భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఉపశమనం లభించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. అయితే, శనివారం ఉదయం పోలీసులు భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐదు బృందాలతో గాలించారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు.

శనివారం మధ్యాహ్నం సమయంలో భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతాడని ప్రచారం జరిగింది. బండి సంజయ్ స్వయంగా తన కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తాడని ప్రచారం జరగడంతో సైబరాబాద్‌ కమిషనరేట్‌ ప్రధాన కార్యాలయం, పేట్‌బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 9గంటల సమయంలో నాలుగు కార్లలో ఇద్దరు న్యాయవాదులను వెంటబెట్టుకుని భగీరథ్ నేరుగా షేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించినట్లు శనివారం రాత్రి బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు. నేను ఇంతకుముందే చెప్పాను. చట్టం ముందు నా బిడ్డ అయినా, సామాన్యుడైనా సమానమే. మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్‌లో అప్పగిద్దామని అనుకున్నా. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని న్యాయవాదులు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నప్పటికీ, ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి విచారణ కోసం లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించా అని బండి సంజయ్‌ వివరించారు. అయితే, పోలీసులు మాత్రం భగీరథ్‌ను అప్పా జంక్షన్ సమీపంలో అరెస్టు చేశామని చెప్పుకొచ్చారు.