Bandi Bhagirath: 15న వస్తా, విచారణకు సహకరిస్తా..! పేట్ బషీరాబాద్ పోలీసులకు బండి భగీరథ్ మెయిల్
ఇవాళ మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట విచారణకు బండి భగీరథ్ హాజరు కావాల్సి ఉంది. కానీ, అతడు విచారణకు రాలేదు.
- Naveen
- Updated on- May 13, 2026 / 06:50 PM IST
Bandi Bhagirath: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ పంపాడు. మే 15న విచారణకు హాజరవుతానని మెయిల్‌లో పేర్కొన్నాడు. కీలక ఆధారాలతో విచారణకు వస్తానని వెల్లడించాడు. సిట్ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశాడు. ఈ-మెయిల్‌తో పాటు అధికారులకు లేఖ కూడా పంపాడు బండి భగీరథ్. కాగా, ఇవాళ మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట విచారణకు బండి భగీరథ్ హాజరు కావాల్సి ఉంది. కానీ, అతడు విచారణకు రాలేదు. ఇంతలో తాను విచారణకు వస్తానని, దర్యాఫ్తునకు సహకరిస్తానని చెబుతూ పోలీసులకు మెయిల్ పంపాడు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2గంటల లోపు విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్న భగీరథ్ కు నోటీసులు ఇచ్చారు.
కాగా, భగీరథ్ ముందస్తు బెయిల్ కు సంబంధించి రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక సిట్ విచారణకు సహకరించమని చెబుతుందా అనేది చూడాలి. ఈ కేసుకి సంబంధించి కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాఫ్తును ముమ్మరం చేసింది. బాధితురాలి నుంచి రెండోసారి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు బండి భగీరథ్ పై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ లో లైంగిక దాడికి సంబంధించిన సెక్షన్లను జోడించారు.
Also Read: తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే- కొడుకు కేసుపై బండి సంజయ్ ఎమోషనల్
