Bandi Sanjay: తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే- కొడుకు కేసుపై బండి సంజయ్ ఎమోషనల్
Bandi Sanjay: తన కొడుకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తన కొడుకు కేసు గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని ఆయన అన్నారు. చట్టం అందరికీ సమానమే అని తేల్చి చెప్పారు. తప్పు చేస్తే తన కొడుకైనా మరొకరైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తన కొడుకును క్రిమినల్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నేను ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడని చెప్పారు. అయినా తాను తన కొడుకును సమర్ధించడం లేదన్నారు.
నా టైమంతా సమాజానికే ఇచ్చానన్న బండి సంజయ్.. కొడుకు కోసం టైమ్ కేటాయించలేకపోయానని వాపోయారు. తాను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని చెప్పారు. కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. తన భార్య సైతం తనను ఫాలో అవుతోందన్నారు. నేనున్నా లేకున్నా కార్యకర్తలకు చేతనైనంత సాయం చేస్తోందన్నారు. ఇవాళ తన కొడుకుపై జరుగుతున్న దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోందని బండి సంజయ్ వాపోయారు.
టవర్ సర్కిల్ పై కాషాయ జెండా ఎగరేశాం. కరీంనగర్ ప్రజలకు హ్యాట్సాఫ్. హిందువుల ఐక్యతను చాటేందుకే 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్ర చేస్తున్నా. జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. హిందూ సమాజానికి ఆపదొస్తే జైశ్రీరాం నినాదంతో తెగించి కొట్లాడతాం. కరీంనగర్ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తుంది. కరీంనగర్ లో గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడా. చిన్న కార్యకర్తగా మొదలైంది నా ప్రస్తానం. నా జీవితం కష్టాలు, బాధలే. బాధలను చూసి భయపడి పారిపోయేటోడిని కాను. మీరే నా కుటుంబం. హార్ట్ లో స్టంట్ ఉన్నా హార్ట్ ఫుల్ గా 1600 కిలోమీటర్లు నడిచా. తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్నా. నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేదు. ఏ హిందువుకు ఆపదొచ్చినా అండగా ఉన్నా. మీ ఇంట్లో పెద్ద కొడుకునైనా” అని బండి సంజయ్ అన్నారు.
Also Read: బెయిల్ ప్లీజ్.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్
