Bandi Bhagirath: బండి భగీరథ్ విచారణ.. ఆ ఫామ్‌హౌస్‌కి తీసుకెళ్లి..
కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.
- Naveen
- Updated on- May 27, 2026 / 09:11 PM IST
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. భగీరథ్ ను మొయినాబాద్ మండలంలోని అరణ్య హౌస్ కు తరలించారు. అక్కడ సీన్ రీకన్ స్ట్రక్షన్ చేయించారు పోలీసులు. భగీరథ్ ను మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు కీలక అంశాలపై విచారించనున్నారు. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.
బండి భగీరథ్ మొదటి రోజు కస్టడీ విచారణ సీన్ రీకన్ స్ట్రక్షన్ తో మొదలైంది. ఉదయం చర్లపల్లి జైలు నుంచి భరీరథ్ ను కస్టడీలోకి తీసుకున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత భగీరథ్ ను నేరుగా మొయినాబాద్ లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడ సుమారుగా గంటకుపైగా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత నేరుగా కూకట్ పల్లి డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్లారు. మొదటి రోజు కొంత సమయం తక్కువున్న నేపథ్యంలో సీన్ రీకన్ స్ట్రక్షన్ కు మాత్రమే పరిమితం అయ్యారు పేట్ బషీరాబాద్ పోలీసులు.
రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు చాలా సుదీర్ఘంగా విచారణ సాగే అవకాశం ఉంది. బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్, బండి భగీరథ్ ఫ్రెండ్స్ ఇచ్చిన స్టేట్ మెంట్ల ఆధారంగా విచారణ సాగుతోంది. తనను ట్రాప్ చేసి మొయినాబాద్ ఫామ్ హౌస్ కు పలుమార్లు భగీరథ్ తీసుకెళ్లినట్లుగా.. బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. చాలాసేపు ఫామ్ హౌస్ లోనే భగీరథ్ ను తిప్పారు. ఏ పర్పస్ తో ఫామ్ హౌస్ కి వచ్చారు, ఎంత మంది వచ్చారు అన్న సమాచారాన్ని పోలీసులకు భగీరథ్ వివరించినట్లు తెలుస్తోంది.
