Bandi Sanjay: సొంత పార్టీ నేతలపై బండి సంజయ్ సంచలన కామెంట్స్.. అందుకేనా?
ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
- T Venkateshwarlu
- Published On : July 21, 2023 / 05:11 PM IST
Bandi Sanjay
Bandi Sanjay – BJP: సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్(Hyderabad), నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడారు.
ఇకనైనా లేనిపోని ఫిర్యాదులు మానుకోవాలని బండి సంజయ్ అన్నారు. కనీసం కిషన్ రెడ్డినైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రశాంతంగా పనిచేయనివ్వాలని కోరారు. తెలంగాణ ఇప్పుడు కాకుంటే మళ్లీ తమ పార్టీ అధికారంలోకి రావడం కష్టసాధ్యమని అనడం గమనార్హం. ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యాయి.
తనపై కొందరు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారని బండి సంజయ్ అన్నారు. కొందరు ఢిల్లీకి తప్పుడు ఫిర్యాదులు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కష్టపడి పనిచేశానన్న సంతృప్తి తనకు ఉందని తెలిపారు. పత్రికల్లో ఉండే వారు ప్రజల్లో ఉండలేరని అన్నారు.
కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. వర్షాలతో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫాంహౌసులో తాగి పడుకుంటున్నారని చెప్పారు. రైతులు, పేదలను ఆదుకోవాలనే సోయి కూడా లేదని అన్నారు. ఎంఐఎం కోసం రూ.లక్ష సాయం పేరుతో మైనారిటీలను కేసీఆర్ మోసం చేస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా తాను పోరాడుతూనే ఉంటానని బండి సంజయ్ తెలిపారు. తమ పార్టీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్త కనిపిస్తే చాలు అరెస్ట్ చేయిస్తున్నారని అన్నారు. పాతబస్తీలో సభ నిర్వహించి బీజేపీ సత్తా చూపించామని చెప్పారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తానని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
