Hyderabad Police Raids : బేగంపేటలో అండాల అక్రమ సేకరణ కలకలం.. గర్ల్స్ హాస్టల్‌పై పోలీసుల దాడి..

Hyderabad Police Raids : హైదరాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్‌లో అండాల అక్రమ సేకరణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించి పలువురు యువతులను విచారిస్తున్నారు.

Hyderabad Police Raids

  • సంతాన సాఫల్య కేంద్రాలకు అండాల సరఫరా? బేగంపేటలో పోలీసుల సోదాలు
  • హాస్టల్ ముసుగులో అక్రమ కార్యకలాపాలు? యువతుల వివరాలపై ఆరా
  • హైదరాబాద్‌లో అనుమానాస్పద అండాల సేకరణ వ్యవహారం..

Hyderabad Police Raids : హైదరాబాద్‌లో మహిళల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన మరో అనుమానాస్పద వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సంతాన సాఫల్య చికిత్సల కోసం ఉపయోగించే మహిళల అండాలను అక్రమంగా సేకరించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు బేగంపేటలో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఓ అపార్ట్‌మెంట్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించి పలువురు యువతులను విచారిస్తున్నారు.

సికింద్రాబాద్ పరిధిలోని ప్రకాష్ నగర్‌లో ఉన్న నజ్రాన్ అపార్ట్‌మెంట్ కేంద్రంగా ఈ కార్యకలాపాలు సాగుతున్నాయనే సమాచారంతో బేగంపేట పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) సంయుక్తంగా రంగంలోకి దిగాయి.

అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల సమయంలో భవనంలో తనిఖీలు చేపట్టాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ‘అమీ నీతా గర్ల్స్ హాస్టల్’ పేరుతో గత ఏడాది కాలంగా అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది..

Read Also : AP Inter Exams 2027 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పరీక్ష ఫీజుకు కొత్త డెడ్‌లైన్!

ఈ భవనంలో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 8 నుంచి 10 మంది యువతులు ఉంటున్నట్లు సమాచారం.. కింది అంతస్తులో నివసిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే యువతుల అండాలను ఎలాంటి అనుమతులు లేకుండా సేకరించి, వివిధ సంతాన సాఫల్య కేంద్రాలకు చేరవేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

మహిళల అండాల సేకరణతోపాటు పురుషుల వీర్యకణాల సరఫరాకు కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉందా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత వ్యక్తుల పరిచయాలు, హాస్పిటళ్లు, ఫెర్టిలిటీ సెంటర్లతో ఉన్న లావాదేవీలపై ఆరా తీస్తున్నారు..

అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. యువతులను ఏ పరిస్థితుల్లో అక్కడ ఉంచారు? వారి సమ్మతి తీసుకున్నారా? చట్టబద్ధమైన వైద్య విధానాలు పాటించారా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అమాయక మహిళలను ప్రలోభాలకు గురిచేసి వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే అక్రమ నెట్‌వర్క్ ఏదైనా ఉందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.