Tamil Nadu Politics : తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. హుటాహుటీన హైదరాబాద్ ఎమ్మెల్యేలు..
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను హైదరాబాద్ లోని క్యాంపుకు తరలించారు.
- Harish Thanniru
- Updated on- May 9, 2026 / 11:43 AM IST
Tamil Nadu politics
- తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్
- టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వని గవర్నర్
- క్యాంప్ రాజకీయాలు మొదలు
- హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే విజయ్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై ఇంకా సందిగ్ద కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయ్ తమిళనాడు గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్‌ను మూడు సార్లు కలిశారు. అయితే, పూర్తిస్థాయి మెజార్టీ లేదని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేనని గవర్నర్ తేల్చి చెప్పడంతో అసలు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
టీవీకే విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేయడంతో ప్రస్తుతం ఆ పార్టీకి 107 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఐదుగురు విజయ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీనికితోడు సీపీఐ, సీపీఐ పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో విజయ్‌కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్లయింది.
అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం జరుగుతున్న వేళ క్యాంపు రాజకీయాలకు తెరలేచింది.
టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడకుండా జాగ్రత్త పడుతోంది. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని క్యాంపుకు తరలించారు. శనివారం ఉదయం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి తాజ్ కృష్ణా హోటల్ లో బస ఏర్పాటు చేశారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి తొలగిపోయేంత వరకు ఆ ఐదుగురు తాజ్ కృష్ణ హోటల్ లోనే ఉండేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
