Harish Rao: ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా? 25 శాతం పెరిగిన నిత్యావసరాల ధరలు.. హరీష్ రావు తీవ్ర ఆగ్రహం

రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు(Harish Rao) మండిపడ్డారు.

BRS leader Harish Rao shocking comments about rising prices of essential commodities

Harish Rao: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్య పౌరుడి నడ్డి విరుస్తుంటే, వాటిని అదుపు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జ్యేష్ఠ నాయకుడు హరీష్ రావు (Harish Rao)విమర్శించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన, పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణా రాహిత్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే సన్నబియ్యం ధరలు ఏకంగా 25 శాతం పెరగడం ప్రభుత్వ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడి వస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మార్కెట్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Supreme Court: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు బిగ్ రిలీఫ్.. సస్పెన్షన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఈసీకి నోటీసులు జారీ!

రైతన్నకు దక్కని గిట్టుబాటు.. దళారుల దోపిడీ!

ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతుకు మద్దతు ధర పేరిట నామమాత్రపు ధరే దక్కుతుంటే, మధ్యదళారులు మాత్రం క్వింటాకు రూ.8,000 వరకు లాభపడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతుకు గిట్టుబాటు ధర దక్కక, వినియోగదారుడికి అందుబాటు ధరలో సరుకులు అందక తీవ్ర అవస్థలు పడుతుంటే కేవలం మధ్యవర్తులు మాత్రమే కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కళ్లముందే ఈ దోపిడీ జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ చోద్యం చూడటం శోచనీయమన్నారు. రేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం నాణ్యత లేకపోవడం వల్లే ప్రజలు బయట మార్కెట్‌పై ఆధారపడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

తక్షణమే అక్రమ నిల్వలపై తనిఖీలు చేపట్టాలి:

బియ్యంతో పాటు ఉల్లిపాయలు, వెల్లుల్లి, వంటనూనెలు, పప్పుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య కుటుంబాల వంటింటి బడ్జెట్ తలకిందులైందని హరీష్ రావు తెలిపారు. వ్యాపారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై తక్షణమే టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని సన్నబియ్యం సహా అన్ని నిత్యావసరాల ధరలకు అడ్డుకట్ట వేసి, సామాన్యుడికి తక్షణ ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.