Supreme Court: సీఈసీ జ్ఞానేష్ కుమార్కు బిగ్ రిలీఫ్.. సస్పెన్షన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఈసీకి నోటీసులు జారీ!
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది.
Supreme Court refuses to stay the appointment of CEC Gyanesh Kumar
Supreme Court: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను ఆ పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టంగా తిరస్కరించింది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారంలో కీలక వాదనలు విన్న తర్వాత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘం చట్టానికి లోబడే పనిచేస్తుందని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. సోషల్ యాక్టివిస్ట్ రాకేష్ కుమార్ సింగ్, లాయర్ శైలేంద్ర మణి త్రిపాఠిలు దాఖలు చేసిన పిటిషన్లలో ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
నోటీసులు జారీ.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు:
ఈ వ్యవహారానికి సంబంధించి సంపూర్ణ సమాధానం చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పదవీ విరమణ తర్వాత కూడా సీఈసీకి ప్రత్యేక రక్షణ కల్పించడంపై పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్లో ఏం జరుగుతుందో స్పష్టత రావాలని, అందుకే మిగిలిన ఇద్దరు కమిషనర్లతో కార్యకలాపాలు నడిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఈసీ నియామకాల కోసం పాత అనూప్ బరన్వాల్ తీర్పు తరహాలో సీజేఐతో కూడిన ఎంపిక కమిటీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
చట్టవిరుద్ధంగా ఉంటే రద్దు చేస్తామన్న సీజేఐ:
వాదనల సమయంలో సీజేఐ జోక్యం చేసుకుంటూ, ముందుగా ఈసీ నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు కావలసి ఉందన్నారు. దేశంలో అమల్లో ఉన్న స్పష్టమైన చట్టాన్ని కమిషన్ పాటించే ఉంటుందని భావిస్తున్నామని, ఒకవేళ ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు విచారణలో ఆధారాలతో తేలితే ఆ నిర్ణయాలను స్వయంగా కోర్టే రద్దు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత దెబ్బతినకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు.
