×
Ad

టార్గెట్ మున్సిపోల్స్.. బీఆర్ఎస్ స్పెషల్ మాస్టర్ ప్లాన్..

రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఆగ్రహంగా ఉన్నారని బీఆర్ఎస్ భావిస్తోందట.

KCR

  • జిల్లాల వారీగా సమీక్షలతో క్యాడర్‌లో జోష్ నింపుతున్న కేటీఆర్
  • పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్
  • బాస్ డైరెక్షన్స్ ప్రకారం కారు దూకుడు.. కేటీఆర్‌ టాప్‌ గేర్

BRS: పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే లెక్క మరోలా ఉండేది. బీఆర్ఎస్ సత్తా ఎంటో తెలిసేది.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ అన్న మాట ఇది. మరిప్పుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరుగబోతున్నాయి. అంటే గూలాబీ పార్టీ సత్తాను నిరూపించుకోవాల్సిన సందర్బం వచ్చిందన్నమాట.

అవును.. ఇదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలను గులాబీ బాస్ కేసీఆర్ ప్రస్తావించడంతో..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారట. మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేలా పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారట.

వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయ్. పదవీకాలం ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ మధ్యే జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సర్పంచులను గెలుచుకున్నా..4 వేలకు పైగా స్థానాలను గెలిచి బలమైన పోటీ ఇచ్చామని ప్రతిపక్ష బీఆర్ఎస్ చెబుతూ వస్తోంది.

Also Read: మంత్రులు, మహిళా ఆఫీసర్ల మీద వార్తలపై తీవ్ర వివాదం.. ఇంతింతై వటుడింతై అన్నట్లు

అయినా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై గులాబీ బాస్ కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేయలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయ్. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను గెలిచి ఉండాల్సిందని పార్టీ నేతలతో జరిగిన అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. పంచాయితీ ఎన్నికలు కనుక పార్టీ గుర్తుపై జరిగి ఉంటే..బీఆర్ఎస్ సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేదని కేసీఆర్ అన్నారట.

గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పారని కేసీఆర్ ఇంటర్నల్‌ మీటింగ్‌లో కామెంట్ చేశారట. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేదని ఓ రకంగా ఛాలెంజ్ చేసిన కేసీఆర్..ఇప్పుడు పార్టీ గుర్తులతో జరుగబోతున్న మున్సిపల్ ఎన్నికలపై స్పెషల్ కాన్సన్‌ట్రేషన్‌ పెట్టారట.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మించి కాకపోయినా ఆ పార్టీతో సరిసమానంగానైనా స్థానాలను గెలవాలన్న పట్టుదలతో ముందుకు వెళ్తోందట బీఆర్ఎస్. కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి పెట్టారట. అందుకే ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్ధేశం చేస్తున్నారట.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే సత్తా చాటేవాళ్లమన్న తమ అధినేత నమ్మకాన్ని నిలబెట్టేలా మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకునేలా కేటీఆర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారట.

రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఆగ్రహంగా ఉన్నారని బీఆర్ఎస్ భావిస్తోందట. మరి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో.? కారు పార్టీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్‌ అవుతుందో లేదో చూడాలి మరి.