ATM Cash Heist: ఏటీఎంలలో పెట్టాల్సిన కోటి రూపాయలు మాయం.. సికింద్రాబాద్‌లో కలకలం
ఈ వ్యవహారంలో ఆ 8 ఏటీఎంలలో డబ్బులు నింపే బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.
- Naveen
- Published On : April 12, 2026 / 06:35 PM IST
ATM Cash Heist: హైదరాబాద్ సికింద్రాబాద్ లో కలకలం రేగింది. ఏటీఎంలలో పెట్టాల్సిన కోటి రూపాయల డబ్బు మాయమైంది. ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన ఇద్దరు ఉద్యోగులు డబ్బుతో పారిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ లోని ‘సీఎంఎస్ ఇన్ ఫో సిస్టమ్స్ లిమిటెడ్’ సంస్థ ఇటీవల అంతర్గత ఆడిటింగ్ నిర్వహించింది. ఈ ఆడిటింగ్ లో ఈ భారీ మోసం బయటపడింది. పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు నింపే కాంట్రాక్ట్ ను సీఎంఎస్ సంస్థ నిర్వహిస్తోంది. ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 31 ఏటీఎంలలో సంస్థ అధికారులు తనిఖీలు చేయగా.. 8 ఏటీఎంలలో భారీగా నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. మొత్తం రూ. 1,20,98,500 నగదు లోటు ఉన్నట్టు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ఆ 8 ఏటీఎంలలో డబ్బులు నింపే బాధ్యతలు చూస్తున్న ఇద్దరు కస్టోడియన్లపైనే సంస్థ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది. కొన్ని రోజులుగా వారు డ్యూటీకి రావడం లేదు. వారి ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసి ఉండటంతో అనుమానం మరింత పెరిగింది. వారే ఈ డబ్బులు కాజేసి ఉంటారని డౌట్ పడుతున్నారు. సికింద్రాబాద్‌లోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. ఏటీఎం కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
”నిందితులను వాసిరెడ్డి, లతీఫ్ లుగా గుర్తించారు. ఏటీఎంలలో డబ్బులు నింపే బాధ్యత వీరిదే. అయితే రెండు రోజులుగా వీరు కనిపించడం లేదు. ఆడిటింగ్ సమయంలో వారు హాజరుకాకపోవడం అనుమానాలను పెంచింది. ఎస్ఆర్ నగర్ ఏరియాలోని 8 ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేయలేదని అంతర్గత ఆడిటింగ్ లో నిర్ధారణ అయ్యింది. ఏజెన్సీ మేనేజర్ వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు వారి కాల్ డేటా రికార్డులను సైతం పరిశీలిస్తున్నారు” అని సంస్థ అధికారులు తెలిపారు.
Also Read: వదిలేదు లేదు.. ప్రతి బొగ్గు గనిలో మళ్లీ అగ్ని మండిస్తాం- సీఎం రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్
