×
Ad

Soundararajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ కన్నుమూత

సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు.

  • Published On : February 27, 2026 / 04:26 PM IST

Soundararajan Representative Image (Image Credit To Original Source)

 

  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూత
  • ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు
  • ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేశారు
  • హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కావాలని నినదించారు

Soundararajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఎం.వి. సౌందర రాజన్ (90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఆయన ఎంతో కాలం క్రమశిక్షణతో, సేవానిరతితో నిర్వహించారు. సౌందర రాజన్ భక్తులతో మమేకమై సేవా విధానాన్ని ఎంతో ప్రశాంతంగా వివరించే వారు.

చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ కన్నుమూతపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో అంకితభావంతో పని చేసిన సౌందర రాజన్ భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారని జగన్ కీర్తించారు. సంప్రదాయాలను కాపాడుతూ ఆలయ పరిపాలనలో, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆయన విశిష్ట పాత్ర పోషించారని తెలిపారు. ఆయన మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటుగా పేర్కొన్నారు. సౌందర రాజన్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జగన్. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.

సౌందరరాజన్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రధాన అర్చకులుగా వ్యవహరించారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఆయన పోరాటం చేశారు. హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కావాలని.. ఏకంగా ప్రభుత్వాలను సైతం ఎదిరించి నిలబడ్డారు. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ‘వీసా బాలాజీ’గా తీర్చిదిద్దడంలో సౌందరరాజన్ కృషి మరువలేనిది.

దేవుడు అంటే వ్యాపారం కాదని బలంగా నమ్మేవారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించారు. 1998లో గుడిలో ఉన్న హుండీని తీసేసి సంచలనం సృష్టించారు. సౌందరరాజన్ ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా సేవలు అందించారు. ఆలయాల్లో వీఐపీ దర్శనాలకు పూర్తి వ్యతిరేకం సౌందరరాజన్. పేద, ధనిక తేడా లేకుండా గుడికి వచ్చే భక్తులందరినీ ఒకే వరుసలో నిలబెట్టి దర్శనాలు కల్పించిన ఘనత సాధించారు.