CM KCR : జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్ రెడీ, అకస్మిక తనిఖీలు
తెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లనున్నారు.
- madhu
- Published On : June 19, 2021 / 02:19 PM IST
Cm Kcr
KCR Plans District Tours : తెలంగాణ సీఎం కేసీఆర్.. జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. 2021, జూన్ 20వ తేదీ ఆదివారం నుంచి ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. 21న వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. ఇక 22న తన దత్తత గ్రామం వాసాలమర్రికి వెళ్లనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి.. భవిష్యత్‌లో చేయాల్సిన పనులపై గ్రామస్తులతో చర్చించనున్నారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో… ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది నవంబర్ 1న వాసాలమర్రిని దత్తత తీసుకుంటున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాతి రోజు అధికారులు.. స్థానిక ప్రజాప్రతినిధులతో సుమారు నాలుగు గంటలపాటు సమీక్షించారు. తన వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామం తరహాలో వాసాలమర్రిని కూడా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం వంద కోట్లు కేటాయిస్తామని, గ్రామంలో ప్రతీ ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు.
అవసరమైతే అంతకంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని మాట ఇచ్చారు. మరో పది రోజుల్లో గ్రామాన్ని సందర్శిస్తానని.. గ్రామస్తులందరితో కలిసి భోజనం చేస్తానని గ్రామ పెద్దలకు హామీనిచ్చారు. నాటి హామీని ఈ నెల 22న నిలబెట్టుకోనున్నారు కేసీఆర్.
