×
Ad

Telangana Cabinet : తెలంగాణ మంత్రి వర్గంలోకి డాక్టర్ రంజిత్ రెడ్డి..! మున్సిపల్ ఎన్నికల తరువాత ముహూర్తం?

Telangana Cabinet : సీఎం రేవంత్ రెడ్డి పరిగి బహిరంగ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు స్పష్టమవుతోంది.

Telangana Cabinet

Telangana Cabinet : కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తరువాత మంత్రి వర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని పరిగిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తరువాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

Also Read : వాటి గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేకపోవటంతో ఆ జిల్లాకు చెందిన నేతలకు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో మల్‌రెడ్డి రంగారెడ్డి లేదంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కే చాన్స్ ఉందన్న ప్రచారమూ జరిగింది. అయితే, శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిగి వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు స్పష్టమవుతోంది.

పరిగి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి డాక్టర్ రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో ప్రభుత్వం వైపునుంచి కూడా మీకు అండగా రంజిత్ రెడ్డి నిలబడతడు.. మీరందరూ కలిసి కట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండని సీఎం రేవంత్ సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని.. రంజిత్ రెడ్డికి మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతీ మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా.. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది.. రంజిత్ రెడ్డి సహకారంతో పని చేయించుకునే బాధ్యత మీది అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

డాక్టర్ రంజిత్ రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల  పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రంజిత్ రెడ్డి.. అదే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల  పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పరిగి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తరువాత కేబినెట్ విస్తరణ జరగడం.. మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో రంజిత్ రెడ్డి వర్గీయులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.