Cm Revanth: ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసుపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు- సీఎం రేవంత్
చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ దర్యాఫ్తు జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6వేల ఫోన్లు ట్యాప్ చేశారని రేవంత్ ఆరోపించారు.
- Naveen
- Published On : March 20, 2026 / 05:43 PM IST
Representative Image (Image Credit To Original Source)
- డ్రగ్స్ కేసుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావులు ఎందుకు స్పందించడం లేదు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీశ్ రావు అసత్య ప్రచారం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్ట ప్రకారమే దర్యాఫ్తు, మరిన్ని అరెస్టులు
Cm Revanth: చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదన రేవంత్ అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావులు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నలు సంధించారాయన. అటు ఫోన్ ట్యాపింగ్ కేసుపైనా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రాసెస్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని బాంబు పేల్చారు.
చట్ట ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ దర్యాఫ్తు జరుగుతోందన్నారు. విచారణ జరగకుండా అరెస్ట్ చేయలేము కదా అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన వెంటనే అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ ను రికార్డ్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6వేల ఫోన్లు ట్యాప్ చేశారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావు ఏ విచారణ కోరినా సిద్ధమే అన్నారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా సోదాలకు వెళ్లిన పోలీసులపైనే కాల్పులు జరిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. ఇంత సంచలమైన కేసుపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ నేరుగానే ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావు.. ఈ ముగ్గురు బీజేపీ కీలక నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని సీఎం రేవంత్ అడిగారు. అసలు వాళ్ల ఉద్దేశాలు ఏంటో అంతు చిక్కడం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వెళ్తున్నాయి అనేదానికి ఇంతకంటే ఇండికేషన్ ఏం కావాలని రేవంత్ అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని సీఎం రేవంత్ అన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హరీశ్ రావుకి క్లీన్ చిట్ వచ్చిందని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా విచారణ జరుగుతోందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ చరిత్రాత్మక అవసరం అని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ముందుకెళ్తుందని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
Also Read: తెలంగాణలో జూన్ 2 నుంచి కొత్త పథకం.. కుటుంబానికి రూ.5లక్షలు.. ఈ పథకం వల్ల ఉపయోగాలు ఇవే..
