Cm Revanth Reddy: ప్రతి కుటుంబానికి జీవిత బీమా, 65లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు- సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనంతో పాటు ట్రాన్స్ పోర్ట్ కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం.
- Naveen
- Published On : March 12, 2026 / 09:19 PM IST
Cm Revanth Representative Image (Image Credit To Original Source)
- విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 తరగతి విధానం
- విద్యను అందిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు
Cm Revanth Reddy: వైద్యం యాంత్రికంగా ఉండొద్దని, మానవత్వంతో కూడిన వైద్య సాయం అందించాలని సీఎం రేవంత్ అన్నారు. మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. దేశంలో హైదరాబాద్ నుంచి 40 శాతం ఫార్మా ఉత్పత్తులు ఉన్నాయని తెలిపారు. కరోనా వాక్సిన్లలో మూడు మన జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి కావడం మనకు గర్వ కారణం అన్నారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, పీవీ నరసింహరావు సరళీకరణ విధానాలు తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధికి పునాదులు వేశారని రేవంత్ చెప్పారు.
చంద్రబాబు హైటెక్ సిటీని పూర్తి చేసి ఐటీ హబ్ గా మార్చారని ప్రశంసించారు. నాణ్యమైన విద్యను అందించాలన్న ఆలోచనతో విద్యా విధానంలో మార్పులు తెస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12 తరగతి విధానం తీసుకొస్తామన్నారు.
”తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనంతో పాటు ట్రాన్స్ పోర్ట్ కల్పిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా లేదా 50 శాతం రాయితీతో ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. విద్యను అందిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుంది. 65 లక్షల మంది హెల్త్ డేటాను తయారు చేస్తున్నాం. వాళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇస్తాం. 20 ఏళ్ల ఆరోగ్యశ్రీ డేటాను ఉపయోగించి డేటా తయారు చేస్తున్నాం. క్యాన్సర్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. డాక్టర్ నోరి దత్తాత్రేయను సలహాదారుడిగా నియమించాం. ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ కోసం 1800 కోట్లు ఖర్చు చేశాం. ఉస్మానియా, టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం 10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. సామాన్యులు భరించ లేని విధంగా వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న డాక్టర్లు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలి. రాష్ట్రంలోని కోటి ముప్పై లక్షల కుటుంబాలకు జీవిత బీమా అందించాలని భావిస్తున్నాం” అని సీఎం రేవంత్ అన్నారు.
Also Read: వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానం.. ఇక పూర్తిగా ఆన్‌లైన్
