Cm Revanth Reddy: ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది- సీఎం రేవంత్

భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం అని రేవంత్ అన్నారు.

  • Updated on- February 13, 2026 / 08:41 PM IST

Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)

  • ఈ తీర్పు ద్వారా ప్రజలు తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు
  • భవిష్యత్‌లో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను గొప్పగా అభివృద్ధి చేస్తాం
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

 

Cm Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రేవంత్. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం అని చెప్పారు. పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనం అన్నారు.

భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం అని రేవంత్ అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి.. ఈ కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని వెల్లడించారు.

ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్ లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లను.. గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

 

Also Read: పురపోరు ఫలితాలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫలించిన హరీశ్ రావు వ్యూహం