×
Ad

Cm Revanth Reddy: బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ.. మళ్లీ వలస పోయే పరిస్థితి తెచ్చారు- సీఎ రేవంత్

కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారిన మోదీ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మళ్లీ మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

Cm Revanth Reddy Representative Image (Image Credit To Original Source)

  • విభజించు, పాలించు, పేదలను అణగదొక్కు
  • మళ్లీ రైతులు, రైతు కూలీలు గ్రామాలు వదిలి పట్టణాలకు వలస పోయే పరిస్థితి
  • మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం

Cm Revanth Reddy: బీజేపీపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి కొత్త నిర్వచనం చెప్పారాయన. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని అన్నారు. ఆనాడు బ్రిటీషర్లతో ఎంత ప్రమాదం ఉండెనో.. ఈనాడు బీజేపీతో అంతే ప్రమాదం ఉందన్నారు. విభజించు, పాలించు, పేదలను అణగదొక్కు అని బ్రిటీషర్స్ ఇచ్చిన ఆలోచనతోనే ఈనాడు మనల్ని అణిచివేయాలని బీజేపీ చూస్తోందన్నారు. పేదల కోసం, రైతు కూలీల కోసం, భూమి లేని నిరు పేదల కోసం, యూపీఎ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తెస్తే.. ఈనాడు ఆ పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు.

మళ్లీ వలసలు మొదలవుతాయి..!

ఆ చట్టం ద్వారా గ్రామాల నుంచి వలసలు తగ్గాయని, గ్రామాల్లో కూలీలు తమ కూలీని తాము నిర్ణయించే శక్తి ఆ చట్టం ఇచ్చిందని రేవంత్ అన్నారు. అదానీ, అంబానీలకు కూలీలు దొరకడం లేదన్నారు. ప్రజలు వలసలు పోవడం లేదన్నారు. ఇవాళ మోదీ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసిందని.. మళ్లీ రైతులు, రైతు కూలీలు, గ్రామాలు వదిలి పట్టణాలకు వలస పోయే పరిస్థితి వచ్చిందని రేవంత్ ఆరోపించారు. పట్టణాలకు వలస పోతే మళ్లీ వెట్టి చాకిరి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మళ్లీ.. బడా కంపెనీలకు చౌకగా కూలీలు దొరుకుతారు..

ఉపాధి హామీ రద్దుతో అదానీ, అంబానీలకు అగ్గువకు (చౌక) కూలీలు దొరుకుతారని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారిన మోదీ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మళ్లీ మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓటు హక్కును కేంద్రం రద్దు చేస్తోందని రేవంత్ ఆరోపించారు. మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా ఖమ్మం జిల్లాలో సర్పంచ్ ను కూడా గెలిపించుకోలేరని అన్నారు. ఖమ్మంలో సీపీఐ శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.

సీపీఐ శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరం. కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మంలో అద్భుతమైన కార్యక్రమం. దేశంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కమ్యూనిస్టులను అభినందిస్తున్నా. రాబోయే వందేళ్ళు పేదలు, గిరిజనుల కోసం నిరంతరం పోరాటం చేయాలని, అవసరమైతే తుదిశ్వాస విడుస్తామని కమ్యూనిస్టులు అంటున్నారు. పాశవిక శక్తులను ఓడించడం కోసం పోరాటం చేయాలి. రవి అస్తమించని రాజ్యంలో కమ్యూనిస్టులు పోరాటం చేశారు. పోరాటాల ద్వారానే స్వాతంత్ర్యం వచ్చింది.

దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఇందిరా గాంధీ, బూర్గుల రామకృష్ణారావు సీలింగ్ యాక్ట్ తెచ్చి భూములు పంచారు. గడీలలో గుమ్మిలు నింపుతుంటే వారిని చైతన్యం చేస్తే వారికి చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దళారులు ధరలు నిర్ణయిస్తున్నారని రైతు కూలీ పోరాటాలు చేస్తే చట్టాలు తెచ్చాం. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నిజాం, రజాకార్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్రా రాజేశ్వరరావు, నల్లమల్ల గిరిప్రసాద్ పోరాటం చేశారు.

బీజేపీ అంటే బ్రిటీష్ పాలన పార్టీ. విభజించి పాలిస్తుంది. పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలని చూస్తోంది. మీ పోరాటాలకు అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ గాంధీ ప్రచారం చేయడంతో బీజేపీ 290 సీట్ల దగ్గర అగిపోయింది. అంబేద్కర్, గాంధీ పేదలకు ఓటు హక్కును కల్పించారు.

కలిసి పోరాటం చేద్దాం.. మోదీని గద్దె దింపుదాం..

మూలవాసులైన ఆదివాసీలను ఆధారాలు తీసుకుని రావాలంటున్నారు. పేదల వ్యతిరేక పార్టీ బీజేపీ. ఓటు తొలగిస్తే సంక్షేమ పథకాలు పోతాయి. అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టు ఏకమై దేశంలో దండు కట్టాలి. ఎర్రజెండా సోదరులు పిలవగానే వచ్చా. మీరు పోరాడే వాటిని చట్టం చేస్తాం. మీ త్యాగం ఉంది. నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి వచ్చినా రెండు సర్పంచ్ లు గెలిపించలేరు. మీరు పోరాటం చేయాలి. కలిసి పోరాటం చేద్దాం, మోదీని గద్దె దింపుదాం” అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

Also Read: తప్పుడు రాతలతో మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర: ధ్వజమెత్తిన రేవంత్‌ రెడ్డి