Heavy Rain: రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితులు.. ఆ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..
- Harish Thanniru
- Published on- May 16, 2025 / 10:03 AM IST
Rain
Telangana Rains: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జోగులాంబ, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ చేసింది. అదేవిధంగా.. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల పరిధిలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాబోయే రెండు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
