Telangana School Holidays: తెలంగాణపై ‘అర్నబ్’ తుపాను ఎఫెక్ట్.. పాఠశాలలు, కాలేజీలు బంద్.. అలర్ట్‌లో ఉన్న జిల్లాలివే!
Telangana School Holidays: అర్నబ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
- V Santhosh Kumar
- Updated on- October 28, 2026 / 10:33 AM IST
Cyclone arnab impact telangana school holidays declared in bhadradri kothagudem
Telangana School Holidays: బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘అర్నబ్’ తీవ్ర తుపాను పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంపై కూడా తన తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రతికూల వాతావరణం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్టోబర్ 28న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఒక రోజు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జారీ చేశారు.
Read Also – Cyclone Arnab: ఏపీలో ‘అర్నబ్’ తుపాను విలయం.. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కుండపోత.. అంధకారంలో జనజీవనం!
ఏపీ-యానాం మధ్య ల్యాండ్‌ఫాల్.. గతి మారితే నెల్లూరు-మచిలీపట్నం వైపు ముప్పు:
ఈ అర్నబ్ తుపాను బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్-యానాం తీరప్రాంతాల మధ్య ల్యాండ్‌ఫాల్ అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అయితే ఒకవేళ తుపాను తన దిశను మార్చుకుంటే నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సూర్యపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
గురువారం మరిన్ని జిల్లాలకు విస్తరించనున్న వర్షాలు.. నిపుణుల తీవ్ర హెచ్చరికలు:
తుపాను ప్రభావం గురువారం నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు విస్తరించనుంది. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగాలు హెచ్చరించాయి.
