TGSRTC Strike: చర్చలు సఫలం.. ఆర్టీసీ సమ్మె విరమణ.. కార్మికుల కీలక డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఆర్టీసీ మన సంస్థ.. అందులోని కుటుంబాలు మనవి. కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు జరిపేందుకు అంగీకరించాం.

  • Updated on- April 25, 2026 / 01:55 AM IST

TGSRTC Strike: ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఈరోజు నుంచి ఆర్టీసీ సర్వీసులు యధావిధిగా నడవనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 11శాతం పీఆర్సీ, గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగతా సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకారం తెలిపింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

”ఆర్టీసీ మన సంస్థ.. అందులోని కుటుంబాలు మనవి. కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఆర్టీసీలో గుర్తింపు సంఘాలకు ఎన్నికలు జరిపేందుకు అంగీకరించాం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై చర్చించాము. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాం” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

ఎప్పటి నుంచో ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించిందని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. ఆర్టీసీలో సంఘా ఎన్నికలు జరిపించడం గొప్ప ముందడుగు అని అన్నారు. సమ్మెలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలన్నారు. అన్ని వర్గాల కార్మికులు నేటి నుంచి ధర్నా విరమించి బస్సులు నడపాలని అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై వేసిన కమిటీలో కార్మికులకు అవకాశం ఇచ్చిందుకు జేఏసీ తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపారు ఆర్టీసీ జేఏసీ నేతలు. అలాగే పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు.