Pod taxis in Hyderabad : ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మెట్రో నుంచి నేరుగా ఆఫీసుకు పాడ్‌ ట్యాక్సీ సదుపాయం.. ఇవి ఎలా పనిచేస్తాయంటే!

Pod taxis in Hyderabad : మెట్రో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు రాకుండానే డ్రైవర్‌ అవసరం లేని ‘పాడ్‌ ట్యాక్సీ’లోకి మారి నేరుగా తమ కార్యాలయాలకు చేరుకునేలా కొత్త రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తోంది.

Hyderabad Pod Taxi Project

Pod taxis in Hyderabad : హైదరాబాద్‌లో ప్రయాణికుల రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు రాకుండానే డ్రైవర్‌ అవసరం లేని ‘పాడ్‌ ట్యాక్సీ’లోకి మారి నేరుగా తమ కార్యాలయాలకు చేరుకునేలా కొత్త రవాణా వ్యవస్థను ప్రతిపాదించింది.

Also Read : Tur Dal Price Rise : కందిపప్పు కొంటున్నారా? కిలో రేటు ఎంతో తెలుసా.. సామాన్యుడి బడ్జెట్‌కు భారీ షాక్‌!

ఐటీ కారిడార్‌, నాలెడ్జ్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, సచివాలయం పరిసరాలను అనుసంధానిస్తూ మొత్తం 40.82 కిలోమీటర్ల మేర పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (పీఆర్‌టీ) నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి వివరించారు.

ఈ ప్రాజెక్టు కోసం లీ అసోసియేట్స్‌ సంస్థ మూడు నెలల పాటు అధ్యయనం చేసింది. తొలుత 44.62 కిలోమీటర్లు, 56.88 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ ప్రతిపాదనలను పరిశీలించి, వాటి ఆధారంగా 40.82 కిలోమీటర్ల హైబ్రిడ్‌ నెట్‌వర్క్‌ను అనుకూలంగా సూచించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఇందులో కూకట్‌పల్లి–రాయదుర్గం మార్గంలో 7.62 కిలోమీటర్లు, రాయదుర్గం–నాలెడ్జ్‌ సిటీ మార్గంలో 12.83 కిలోమీటర్లు, రాయదుర్గం/హైటెక్‌ సిటీ–ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మార్గంలో 14.01 కిలోమీటర్లు, సచివాలయం–ఎన్టీఆర్‌ మార్గ్‌ కారిడార్‌లో 6.36 కిలోమీటర్ల మేర నెట్‌వర్క్‌ ఉండనుంది. ఈ మార్గాల ద్వారా ఐటీ ఉద్యోగులు, కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులకు చివరి దశ రవాణా సదుపాయం కల్పించాలన్నది ప్రధాన లక్ష్యం.

ఈ పాడ్‌ ట్యాక్సీ నెట్‌వర్క్‌ను దశలవారీగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 2030 నాటికి 34.66 కిలోమీటర్లు, 2040 నాటికి 39.36 కిలోమీటర్లు, 2050 నాటికి పూర్తి నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రణాళిక. ఈ వ్యవస్థ ద్వారా రోజువారీ ప్రయాణికుల సంఖ్య 2030లో 5.42 లక్షలు, 2040లో 15.47 లక్షలు, 2050 నాటికి 20.31 లక్షలకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోలోని 69 కిలోమీటర్ల మార్గంలో రోజుకు సుమారు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాడ్‌ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు చేరుకునే ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌ ప్రాంతంలోనూ పాడ్‌ ట్యాక్సీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.

హైదరాబాద్‌ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం వ్యయం, ప్రయాణికుల టికెట్‌ ధరలు, నిర్మాణ పనుల ప్రారంభ తేదీ, పూర్తి చేసే గడువు ఇంకా వెల్లడికాలేదు. ఇవి ఖరారైన తర్వాతే ప్రాజెక్టు అమలు తీరుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదిత నెట్‌వర్క్‌ కార్యరూపం దాల్చితే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు మెట్రో నుంచి కార్యాలయాలకు చేరుకునే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం అందుబాటులోకి రావచ్చు.