Jayashankar Bhupalpally : భూపాలపల్లి జిల్లాలో ఘోరం.. వాహనాలు తనిఖీ చేస్తుండగా బొగ్గుటిప్పర్ ఢీకొని డీటీవో మృతి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

డీటీవో వెంకన్న మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

DTO Venkanna Demise After Hit By Lorry in Jayashankar Bhupalpally district

Jayashankar Bhupalpally : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాహనాలు తీనిఖీ చేస్తూ విధి నిర్వహణలో నిమగ్నమైన ఓ ప్రభుత్వ అధికారిపైకి బొగ్గు లారీ మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. దీంతో సదరు అధికారి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన అధికార వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదమా..? కావాలనే లారీ డ్రైవర్ అధికారిని ఢీకొట్టాడా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Tirupati Road Accident : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొనడంతో.. 30మందికిపైగా..

జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) వెంకన్న సోమవారం చెల్పూరు శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత 15రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెంకన్న బదిలీపై వచ్చారు. ప్రతిరోజులాగే వాహనాల తనిఖీల్లో నిమగ్నమైన ఆయన.. రహదారి భద్రతకోసం విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద విషయం తెలియగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీటీవో వీధుల్లో భాగంగా ఓ హార్వెస్టర్‌ను సీజ్ చేయగా కార్యాలయంలోనికి వెళ్తున్న క్రమంలో పక్కనే వాహనాలు తనిఖీ చేస్తున్న డిటివో‌పైకి తాడిచెర్ల నుండి కేటిపిపిలోకి వెళ్లే బొగ్గు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వాహనం బ్రేక్ ఫెయిల్ అయిందా, డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమా అనే కోణంలో పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రమాదానికి కారణమైన బొగ్గు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

డీటీవో వెంకన్న మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు.. డీటీవో వెంకన్న మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్నివిధాల ఆదుకుంటామని తెలిపిన సీఎం.. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

డీటీవో మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి : హరీశ్ రావు
భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాల వ్యవహారాలను పూర్తిస్థాయిలో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాల అక్రమాలకు అడ్డుగా నిలిచిన వారిని లారీలతో తొక్కించి చంపేస్తారా? అంటూ హరీశ్ రావు ఘాటుగా ప్రశ్నించారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి హృదయ విదారక ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.