Eagle Force Operation : ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. మళ్లీ తప్పించుకున్న డ్రగ్స్ డాన్ నీతూబాయి.. ఎవరీ లేడీడాన్.. గతంలో ఏం చేసేదంటే?
Eagle Force Operation : హైదరాబాద్‌లో గంజాయి మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నీతూ బాయి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసాన్ని గంజాయి విక్రయాల కేంద్రంగా మార్చి, కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
- Harish Thanniru
- Updated on- June 10, 2026 / 11:11 PM IST
Eagle Force Operation
Eagle Force Operation in Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈగల్ ఫార్స్ టీం భారీ ఆపరేషన్లు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. హైదరాబాద్‌లో గంజాయి మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నీతూ బాయి వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. నానక్‌రామ్‌గూడలోని ఆమె నివాసాన్ని గంజాయి విక్రయాల కేంద్రంగా మార్చి, కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అధికారుల వివరాల ప్రకారం.. నీతూ బాయిపై 2017 నుంచి 2024 వరకు ఎన్‌డీపీఎస్ (NDPS), ఎక్సైజ్ చట్టాల కింద దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్టయినా ఆమె తన కార్యకలాపాలను కొనసాగించిందని పోలీసులు తెలిపారు. 2023లో నమోదైన ఓ భారీ గంజాయి కేసులో నీతూబాయిని అరెస్టు చేసిన అధికారులు రూ.40.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 16 బ్యాంకు ఖాతాల్లో రూ.1.53 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు సంస్థలు ఆమెకు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశాయి.
జైలు నుంచి విడుదలైన అనంతరం కూడా నీతూబాయి మళ్లీ గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. 2024 మార్చిలో ఈగిల్ ఫోర్స్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఆమె ఇంటి నుంచి 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ఫోన్‌పే స్కానర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల విచారణలో నీతూబాయి ఇంటి వద్దకు గంజాయి కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వచ్చేవారని తేలింది. రేషన్ దుకాణం తరహాలో చిన్నచిన్న ప్యాకెట్లుగా గంజాయిని విక్రయిస్తూ హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో విస్తృత సరఫరా నెట్‌వర్క్‌ను నిర్వహించినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగించినట్లు పోలీసులు వెల్లడించారు.
నీతూ బాయి ఇంటి వద్ద గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన 47 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈగిల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, నీతూ బాయి తప్పించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో 2021లో ఆమెపై పీడీ యాక్ట్ అమలు చేసినప్పటికీ, ఆ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. అనంతరం ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అయినప్పటికీ నీతూ బాయి అక్రమ కార్యకలాపాలు కొనసాగుతుండటంతో, ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా మరోసారి పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకప్పుడు సాధారణ గృహిణిగా ఉన్న నీతూబాయి స్వస్థలం ధూల్‌పేట్. ఆమె కుటుంబం మొత్తం గుడుంబా దందా చేసేది. అయితే ఆబ్కారీ శాఖ రాష్ట్రంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పూర్తిగా నిషేధించడంతో వారు గంజాయి దందా మొదలుపెట్టారు. తమ బంధువులు అంతా ధూల్‌పేటను కేంద్రంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తుండగా.. నీతూబాయి మాత్రం నానక్‌రాంగూడలోని లోధా బస్తీకి మకాం మార్చింది.
