Ktr: పేరుందని పథకాలు ఆపేస్తారా? అధికారం శాశ్వతం కాదు.. కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఫైర్
ప్రభుత్వాలు మారినప్పటికీ, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలను కొనసాగించడమే నిజమైన పరిపాలన లక్షణమని కేటీఆర్ (Ktr)అభిప్రాయపడ్డారు.
BRS leader KTR sensational comments on Congress government welfare schemes.
- ప్రభుత్వాలు మారినా సంక్షేమం ఆగవద్దు
- పథకాల రద్దుపై కేటీఆర్ ఫైర్
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
Ktr: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారి పాలకులు మారినప్పటికీ, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పాత సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగించడమే ప్రజాస్వామ్యంలో నిజమైన పరిపాలన లక్షణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యమని, గత ప్రభుత్వాల మంచి నిర్ణయాలను రద్దు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాలతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన విస్తృత పర్యటనలో భాగంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాత పథకాల రద్దుపై ధ్వజం:
ముందుగా వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కేటీఆర్(Ktr) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రజాదరణ పొందిన పథకాలను భారాస అధికారంలోకి వచ్చాక కూడా రద్దు చేయకుండా మరింత బలోపేతం చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసీఆర్ పేరు ఉందనే ఏకైక కారణంతో ‘కంటి వెలుగు’, ‘కేసీఆర్ కిట్’ వంటి పథకాలను పక్కనబెట్టడం తీవ్ర బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
నేత కార్మికుడి కుటుంబానికి పరామర్శ:
అనంతరం సిరిసిల్ల పట్టణంలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిస్తూ, మృతుడి కుమార్తె భవిష్యత్తు కోసం రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్‌ను సైతం అందించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కుట్రలు పన్నారని, ఈ కేసులో కేవలం పాత్రధారులు మాత్రమే అరెస్టయ్యారని, దీని వెనుక పెద్ద నాయకుల హస్తం ఉందని స్పష్టం చేశారు. పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి వెంకటేశం కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
