×
Ad

Harish Rao: లోపల జరిగింది ఇదే..! సిట్ విచారణ తర్వాత హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్

దమ్ముంటే నా విచారణ వీడియోను బయటపెట్టాలి. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ‌గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి.

  • లోపల సొల్లు తప్ప మరేమీ లేదు
  • అరెస్టులు మాకు కొత్త కాదు
  • దర్యాఫ్తు పేరుతో రేవంత్ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు

 

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. విచారణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. లోపల సొల్లు పురాణం తప్ప మరేమీ లేదన్నారు. ఫోన్లు రావడం విచారణ అధికారులు బయటకు వెళ్లి గంటలు గంటలు మాట్లాడటం.. ఇది తప్ప మరొక ముచ్చట లేదన్నారు. అడిగిందే అడిగారు తప్ప అందులో ఏమీ లేదన్నారు. ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్ అన్నారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు హరీశ్ రావు. ప్రభుత్వ హామీలపై ప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.

”ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు ఏం సంబంధం? సిట్ నన్ను ప్రశ్నలు అడగటం కాదు, వాళ్లకే నేను వందల ప్రశ్నలు వేశా. నేను హోంమంత్రి కాదు కదా? అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లను అడగండి. సిట్ నోటీసులు ఒక ట్రాష్. విచారణ సమయంలో సిట్ అధికారులకు పదే పదే ఫోన్లు వచ్చాయి. నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఒక్క ఆధారం కూడా చూపించలేదు. నోటీసులు వస్తే పారిపోము. అరెస్టులు మాకు కొత్త కాదు. కేసీఆర్ నాయకత్వంలో రాటుదేలాం. చట్టంపై గౌరవం ఉంది. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తాం. సింగరేణి టెండర్లపై మేము ప్రశ్నించాం.

సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టగానే సిట్ నోటీసులు ఇచ్చారు. సింగరేణిలో వేల కోట్ల రూపాయల స్కామ్ కి తెరతీశారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయి. నిజాయితీపరుడివే అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మీ దోపిడీని ప్రశ్నిస్తున్నామని మాపై కేసులు పెడుతున్నారు. దర్యాఫ్తు పేరుతో సీఎం రేవంత్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే సిట్ విచారణ వీడియోని బయటపెట్టాలి” అని హరీశ్ రావు సవాల్ విసిరారు.

Also Read: బైక్ కీస్ లాక్కోవద్దు, బలవంతం చేయొద్దు.. పెండింగ్ చలాన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు

దమ్ముంటే.. రాజకీయంగా చూసుకుందాం రా..

సీఎం రేవంత్ తన పతనానికి తానే నాంది పలుకుతున్నారు. రాజకీయంగా చూసుకుందామని సవాల్ విసురుతున్నా. సిట్ నోటీసులు, విచారణ ఒక ట్రాష్. విచారణలో సొల్లు పురాణం తప్ప మరొకటి లేదు. బొగ్గు కుంభకోణంలో రేవంత్ తప్పు చేయకుంటే.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. రేవంత్ కు ధైర్యముంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోవాలి. విచారణలో అడిగిందే అడగటం తప్ప మరొకటి లేదు. రేవంత్ బావమరిది బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టినందుకే నాకు సిట్ నోటీసులు. సైట్ విజిట్ సర్టిఫికేట్ మెదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. సింగరేణిలో వేల కోట్ల కుంభకోణానికి కింగ్ పిన్ సీఎం బావమరిది. సీఎం రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయితీ నడుస్తోంది.

అధికారంలోకి రాగానే.. బొగ్గు కుంభకోణంపై విచారణ..

ఇంకెన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినోళ్ళం. సమైక్యవాదులు పెట్టిన వందలాది కేసులకే భయపడలేదు. సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. సిట్ నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. నన్ను అక్రమ కేసులో ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. దమ్ముంటే నా విచారణ వీడియోను బయటపెట్టాలి. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.

ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ‌గొంతులు సింహంలా గర్జిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకుంటున్నా సిగ్గు రావటం లేదు. రేవంత్ భాష, మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేసీఆర్ తయారు చేసిన సైనికులం. రేవంత్ మాదిరి వెన్నుపోటు రాజకీయాలు మాకు తెలియదు. దర్యాప్తు పేరుతో రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. బొగ్గు కుంభకోణంపై విచారణ జరుపుతాం” అని హరీశ్ రావు అన్నారు.

ఇక మీడియాతో చిట్ చాట్ లో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు నన్ను ప్రశ్నలు అడగడం కాదు.. వాళ్లకే నేను వందల ప్రశ్నలు వేశాను అని చెప్పారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లను విచారణకు పిలవాలని అన్నానని తెలిపారు. శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను విచారణకు పిలవాలని తాను డిమాండ్ చేశానని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకేం సంబంధం, నేను హోంమంత్రిని కాదు కదా? అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.