Harish Rao: మైనింగ్ మంటలు.. సీఎం రేవంత్ కు హరీశ్ రావు సవాల్
రేవంత్ తన బావమరిది అమృత్ టెండర్లు, సింగరేణిలో అవినీతిపై కమిటీ వేసేందుకు సిద్ధమా? అని హరీశ్ రావు అడిగారు.
- Naveen
- Published On : March 29, 2026 / 05:58 PM IST
Harish Rao: మైనింగ్ వ్యవహారం మంటలు రాజేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మంత్రిని కాపాడేందుకే సీబీసీఐడీ విచారణ అని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ తన తమ్ముడి అవినీతిపై విచారణకు సిద్ధమైతే, నేనూ సిద్ధమే అని హరీశ్ రావు అన్నారు.
రేవంత్ తన బావమరిది అమృత్ టెండర్లు, సింగరేణిలో అవినీతిపై కమిటీ వేసేందుకు సిద్ధమా? అని హరీశ్ రావు అడిగారు. కమిటీ వేసేందుకు మీరు సిద్ధమైతే హౌస్ కమిటీ విచారణకు తాను సిద్ధమే అని హరీశ్ రావు తేల్చి చెప్పారు. హౌస్ కమిటీ వద్దు, సీబీసీఐడీ విచారణ వద్దు ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామా.. సిద్ధమా? అని ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు హరీశ్ రావు.
మంత్రి కంపెనీ అవినీతికి పాల్పడిందని సభలో సీఎం రేవంత్ అంగీకరించారని హరీశ్ రావు అన్నారు. మంత్రికి జరిమానా వేశామని అన్నారు, మరి జరిమానా కట్టారా? అని హరీశ్ రావు అడిగారు. ప్రభుత్వం డిఫెన్స్ లో ఉంది కాబట్టే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. మైనింగ్ లో అవినీతికి పాల్పడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కి చిత్తశుద్ధి ఉంటే హౌస్ కమిటీ వేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని హరీశ్ రావు అన్నారు.
Also Read: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా వర్తింపు
